Coal Gasification | బొగ్గు గ్యాసిఫికేషన్‌లోకి సింగరేణి

బెల్లంపల్లిలో భూగర్భ బొగ్గు గ్యాసిఫికేషన్ పైలట్ ప్రాజెక్టుకు సన్నాహాలు
భీమారం, చెన్నూరు, నైనీ ప్రాంతాల్లో సాధ్యాసాధ్యాలపై అధ్యయనం..
ప్రత్యామ్నాయ సాంకేతికతలపైనా దృష్టి

Coal Gasification | ఆంధ్ర‌ప్ర‌భ వెబ్‌డెస్క్ : సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ (ఎస్‌సీసీఎల్) బొగ్గు ఆధారిత ఇంధన రంగంలో మరో ముందడుగు వేయనుంది. భూగర్భ బొగ్గు గ్యాసిఫికేషన్ (అండర్‌గ్రౌండ్ కోల్ గ్యాసిఫికేషన్) రంగంలోకి ప్రవేశించేందుకు సంస్థ సన్నాహాలు ప్రారంభించింది. ఈ మేరకు బెల్లంపల్లి డిప్‌సైడ్ బ్లాక్‌లో పైలట్ ప్రాజెక్టు అమలుకు అవసరమైన డ్రిల్లింగ్ పనుల ఏర్పాట్లు జరుగుతున్నట్లు సంస్థ సీఎండీ డాక్టర్ బుద్దప్రకాశ్ జ్యోతి వెల్లడించారు.

అలాగే భీమారం, చెన్నూరు సౌత్, నైనీ ప్రాంతాల్లో సర్ఫేస్ కోల్ గ్యాసిఫికేషన్ ప్రాజెక్టుల సాధ్యాసాధ్యాలపై సాంకేతిక, ఆర్థిక అధ్యయనం కొనసాగుతోందని తెలిపారు. ఈ ప్రాజెక్టుల ద్వారా బొగ్గును మరింత సమర్థవంతంగా వినియోగించి విలువ ఆధారిత ఉత్పత్తులను తయారు చేసే అవకాశాలను పరిశీలిస్తున్నట్లు చెప్పారు.

అమ్మోనియం నైట్రేట్ మెల్ట్ ప్లాంట్ సామర్థ్యాన్ని పెంచడం, కేంద్ర ప్రభుత్వ వయబిలిటీ గ్యాప్ ఫండింగ్ (VGF) వినియోగం, స్వదేశీ సాంకేతిక పరిజ్ఞానాన్ని ప్రోత్సహించడం వంటి ప్రత్యామ్నాయాలపై కూడా సంస్థ దృష్టి సారించిందని వెల్లడించారు.

ఈ అంశాలపై కేంద్ర పెట్రోలియం మంత్రిత్వ శాఖ డైరెక్టర్ జనరల్ డాక్టర్ శ్రీకాంత్ నాగులపల్లితో జరిగిన సమావేశంలో సమగ్రంగా చర్చించినట్లు సీఎండీ తెలిపారు. బొగ్గు గ్యాసిఫికేషన్ ప్రాజెక్టులు అమల్లోకి వస్తే సింగరేణిలో సాంకేతిక పరిజ్ఞానం విస్తరణతో పాటు ఇంధన రంగంలో కొత్త అవకాశాలు అందుబాటులోకి వస్తాయని ఆయన అభిప్రాయపడ్డారు.