బాధిత విద్యార్థులకు అండగా అనురాధ
అచ్చంపేట, ఆంధ్రప్రభ: మన్ననూర్ పీటీజీ గురుకుల పాఠశాలలో ఫుడ్ పాయిజన్ ఘటనతో అస్వస్థతకు గురై అచ్చంపేట ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న విద్యార్థులను టీపీసీసీ ఉపాధ్యక్షులు, డీసీసీ అధ్యక్షులు, అచ్చంపేట ఎమ్మెల్యే డాక్టర్ చిక్కుడు వంశీకృష్ణ సతీమణి, సీబీఎం ట్రస్ట్ చైర్పర్సన్ డాక్టర్ చిక్కుడు అనురాధ గురువారం పరామర్శించారు.
విద్యార్థుల ఆరోగ్య పరిస్థితిని వైద్యులను అడిగి తెలుసుకున్న ఆమె, ప్రతి విద్యార్థికి మెరుగైన వైద్యం అందించడంతో పాటు ప్రత్యేక పర్యవేక్షణ కొనసాగించాలని సూచించారు.
అనంతరం విద్యాశాఖ అధికారులతో మాట్లాడిన డాక్టర్ అనురాధ.. ఫుడ్ పాయిజన్ ఘటనకు దారితీసిన కారణాలపై సమగ్ర విచారణ చేపట్టాలని కోరారు. ఈ ఘటనపై ఎమ్మెల్యే డాక్టర్ చిక్కుడు వంశీకృష్ణ కూడా అధికారులతో మాట్లాడి, బాధ్యులపై ఎలాంటి రాజీ లేకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించినట్లు తెలిపారు.
విచారణలో నిర్లక్ష్యం నిర్ధారణ అయితే గురుకుల పాఠశాల ప్రిన్సిపాల్‌తో పాటు సంబంధిత సిబ్బందిపై కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. బాధిత విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, ప్రభుత్వం అన్ని విధాలుగా అండగా ఉంటుందని డాక్టర్ అనురాధ భరోసా ఇచ్చారు.
ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ అంతటి రజిత మల్లేష్, మాజీ ఎంపీపీ రామనాథం, టౌన్ కాంగ్రెస్ అధ్యక్షుడు ఖాదర్, మాజీ కౌన్సిలర్ గౌరీశంకర్, కాంగ్రెస్ నాయకులు, యూత్ కాంగ్రెస్, ఎన్ఎస్యూఐ నాయకులు, వివిధ అనుబంధ సంఘాల ప్రతినిధులు, స్థానిక ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.
