దేవాదుల నీటిని వెంటనే విడుదల చేయాలి: హింగే భాస్కర్
ఎల్కతుర్తి, ఆంధ్రప్రభ: జిల్లాలో నెలకొన్న వర్షాభావ పరిస్థితులు, సాగునీటి కొరత కారణంగా వరి నారు ఎండిపోతోందని, రైతులను ఆదుకునేందుకు దేవాదుల ప్రాజెక్టు నుంచి చెరువులు, కుంటలకు వెంటనే సాగునీటిని విడుదల చేయాలని ఉమ్మడి కరీంనగర్–హనుమకొండ జిల్లాల రైతు రక్షణ సమితి అధ్యక్షుడు హింగే భాస్కర్ డిమాండ్ చేశారు.
హనుమకొండ జిల్లా ఎల్కతుర్తి మండల కేంద్రంలో గురువారం హింగే భాస్కర్ ఆధ్వర్యంలో రైతులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, సాగునీరు అందక రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
రైతులే దేశానికి వెన్నెముక అని, వారిని అన్ని విధాలా ఆదుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు. సాగునీరు లేక పంటలు దెబ్బతింటే రైతులు తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని పేర్కొన్నారు.
రైతులకు అండగా నిలిచి పంటలను కాపాడేందుకు దేవాదుల ప్రాజెక్టు నుంచి వెంటనే నీటిని విడుదల చేయాలని, రైతుల సమస్యలను యుద్ధప్రాతిపదికన పరిష్కరించాలని ప్రభుత్వాన్ని కోరారు. ఈ సమావేశంలో జిల్లా సలహాదారు సుఖినో సుధాకర్‌రావు, మండల అధ్యక్షుడు కొక్కు తిరుపతి, కోదాడ మాధవరావు, రవీందర్రావు, కుమార్ తదితరులు పాల్గొన్నారు.
