చెరువుల్లో ‘డెవిల్ ఫిష్’ కలకలం..

చెరువుల్లో ‘డెవిల్ ఫిష్’ కలకలం..
మత్స్యకారులకు భారీ నష్టం
మడిపల్లి ముత్యాలమ్మ కుంటలో ప్రత్యక్షమైన దయ్యం చేపలు
తొర్రూరు, మే 23 (ఆంధ్రప్రభ): ఇప్పటివరకు చెరువుల్లో పెద్ద చేపలు పడితే సంబరపడే మత్స్యకారులు, ఇప్పుడు ఓ విచిత్రమైన చేపను చూసి భయాందోళనకు గురవుతున్నారు. “సక్కర్ మౌత్ క్యాట్ ఫిష్”గా పిలిచే ఈ చేపలను స్థానికులు “డెవిల్ ఫిష్” లేదా “దయ్యం చేపలు”గా పేర్కొంటున్నారు.
ఇటీవల వివిధ ప్రాంతాల్లో కనిపిస్తున్న ఈ డెవిల్ ఫిష్‌లు తాజాగా మండలంలోని మడిపల్లి గ్రామ ముత్యాలమ్మ కుంటలో ప్రత్యక్షమయ్యాయి. వీటికి ఉండే పదునైన పళ్లు, గట్టి ముళ్లతో ఇతర చేపలను గాయపరిచి తినేస్తాయని మత్స్యకారులు చెబుతున్నారు. చెరువుల్లోకి చేరిన కొద్ది రోజుల్లోనే ఇతర చేపల సంఖ్యను భారీగా తగ్గిస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
విషపూరిత స్వభావం కలిగిన ఈ చేపలను ఎవరూ ఆహారంగా వినియోగించరని, దీంతో చెరువుల్లో ఇవి విపరీతంగా పెరిగిపోతున్నాయని తెలిపారు. మండలంలోని పలు చెరువుల్లో ఈ దయ్యం చేపలు అధిక సంఖ్యలో పెరిగి మత్స్యకార కుటుంబాల జీవనాధారాన్ని దెబ్బతీస్తున్నాయని వాపోయారు.
మడిపల్లి గ్రామ మత్స్యకారులు గతేడాది వేసవిలో చేపల విక్రయాల ద్వారా రూ.3 లక్షలకు పైగా ఆదాయం పొందగా, ఈ ఏడాది అది కేవలం రూ.6 వేలకే పరిమితమైందని తెలిపారు. ప్రస్తుతం వల వేస్తే పదుల సంఖ్యలో డెవిల్ ఫిష్‌లే చిక్కుతున్నాయని, వాటిని వెంటనే కాల్చివేస్తున్నామని చెప్పారు.
ఈ చేపలు చెరువుల్లోకి ఎలా చేరాయో తెలియడం లేదని, గతంలో ప్రభుత్వం పంపిణీ చేసిన చేప పిల్లలతో పాటు వచ్చి ఉండొచ్చని మత్స్యకారులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. దయ్యం చేపల కారణంగా తెల్ల చేపల పెరుగుదల తగ్గిపోయి, ప్రస్తుతం బురకలు మాత్రమే మిగిలిపోయాయని ఆందోళన వ్యక్తం చేశారు.
