ఉగాది శుభాకాంక్షలు తెలిపిన ఎమ్మెల్యే నాయిని..
హన్మకొండ కలెక్టరేట్, ఆంధ్రప్రభ ; హనుమకొండ జిల్లా, వరంగల్ పశ్చిమ నియోజకవర్గ ప్రజలకు ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి శ్రీ పరాభవ నామ సంవత్సరం ఉగాది పర్వదినం సందర్భంగా శుభాకాంక్షలు తెలిపారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉగాది పండుగ తెలుగు ప్రజల సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీక అని పేర్కొన్నారు. కొత్త సంవత్సరంలో ప్రతి కుటుంబంలో సుఖసంతోషాలు వెల్లివిరియాలని, ప్రజలందరికీ ఆరోగ్యం, ఆయుష్షు, ఐశ్వర్యం కలగాలని ఆకాంక్షించారు.
ప్రతి ఒక్కరి జీవితాల్లో కొత్త ఆశలు, కొత్త ఆరంభాలు కలగాలని, గత సంవత్సరంలోని కష్టాలను అధిగమించి ఈ సంవత్సరం విజయాల బాటలో నడవాలని కోరారు. రైతులు పంటలతో సిరిసంపదలు సాధించాలని, యువత తమ లక్ష్యాలను చేరుకోవాలని, మహిళలు అన్ని రంగాల్లో మరింత ముందుకు సాగాలని ఆకాంక్షించారు.
రాష్ట్రం మరింత అభివృద్ధి పథంలో దూసుకెళ్లాలని, ప్రజల సహకారంతో సంక్షేమ కార్యక్రమాలు మరింత బలోపేతం అవుతాయని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు.
ఉగాది పచ్చడి లాగా జీవితంలో వచ్చే అనుభవాలన్నిటినీ సమానంగా స్వీకరించి ముందుకు సాగాలని సూచిస్తూ, ఈ నూతన సంవత్సరంలో ప్రతి ఇంటా ఆనందం, ఐక్యత నెలకొనాలని ఆకాంక్షించారు.
