అందుబాటులో లాప్రోస్కోపిక్ ఆపరేషన్లు

  • నిర్మల ఆసుపత్రితో కూరపాటి లాప్రోస్కోపిక్ సెంటర్ ఎంఓయూ
  • తొర్రూరు కేంద్రంగా అందుబాటు ధరల్లో లాప్రోస్కోపిక్ ఆపరేషన్లు

తొర్రూరు, ఆంధ్రప్రభ : రోగులకు ప్రయోజనం చేకూర్చే మినిమల్లీ ఇన్వేసిన్ విధానాన్ని కలిగి ఉన్న లాప్రోస్కోపిక్ ఆపరేషన్లను గ్రామీణ ప్రాంతాలకు విస్తరిస్తున్నట్లు కూరపాటి అడ్వాన్స్డ్ లాప్రోస్కోపిక్ సెంటర్ నిర్వాహకులు డాక్టర్ కూరపాటి రమేష్, నిర్మల ఆసుపత్రి నిర్వాహకులు డాక్టర్ రంజిత్ కుమార్ లు తెలిపారు.అధునాతన ఆపరేషన్లు నిర్వహించేందుకు తొర్రూర్ లోని నిర్మల ఆసుపత్రితో హనుమకొండ కూరపాటి అడ్వాన్స్డ్ లాప్రోస్కోపిక్ సెంటర్ ఎంవోయూ కుదుర్చుకుంది.

ఈ మేరకు మంగళవారం పట్టణంలోని నిర్మల ఆసుపత్రిలో నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమంలో ఎం ఓ యు ఒప్పంద పత్రాలను నిర్మల ఆసుపత్రి నిర్వాహకులు డాక్టర్ రంజిత్ కుమార్,కూరపాటి రమేష్ లు పరస్పరం మార్చుకున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తొర్రూరు వంటి గ్రామీణ ప్రాంతాలకు సైతం అధునాతన లాప్రోస్కోపిక్ సేవలు అందుబాటులోకి తెచ్చే ఉద్దేశంతో కూరపాటి లాప్రోస్కోపిక్ సెంటర్తో నిర్మల ఆసుపత్రి ఒప్పందం కుదుర్చుకుందని తెలిపారు.

సంప్రదాయ ఆపరేషన్లకు భిన్నంగా లాప్రోస్కోపిక్ విధానంలో చిన్నపాటి రంద్రాల సాయంతో జల్లెడ లాంటి మిషన్ ను అమర్చి సులువుగా హెర్నియా వంటి సమస్యను పరిష్కరించవచ్చని తెలిపారు. లాప్రోస్కోపిక్ పద్ధతిలో పెద్ద ఆపరేషన్ల మాదిరి వారాల తరబడి ఆసుపత్రిలో ఉండాల్సిన అవసరం లేదని, చాలావరకు ఆపరేషన్లు చేసిన 24 నుండి 48 గంటలలోపు రోగిని డిశ్చార్జ్ చేయవచ్చని తెలిపారు.

ప్రస్తుతం పిత్తాశయం తొలగింపు, అపెండిసైటిస్, హెర్నియా, గర్భాశయ సమస్యలు (గడ్డలు, ఫైబ్రాయిడ్స్), మరియు బేరియాట్రిక్ (బరువు తగ్గించే) సర్జరీలకు ఈ లాపరోస్కోపిక్ విధానాన్నే ప్రామాణికంగా ఉపయోగిస్తున్నారని తెలిపారు. నిర్మల ఆసుపత్రి కేంద్రంగా లాప్రోస్కోపిక్ ఆపరేషన్లు నిర్వహించేందుకు ఎం ఓ యు దోహదపడుతుందని తెలిపారు. ఈ సమావేశంలో నిర్మల హాస్పిటల్ వైద్యులు డాక్టర్ బి.శృతి తదితరులు పాల్గొన్నారు.