డివైడర్‌ను ఢీకొట్టిన లారీ..

ప్రాపర్టీ డ్యామేజ్ జరిగినా కేసు నమోదు చేయలేదని ఆరోపణలు

తొర్రూరు రూరల్, ఆంధ్రప్రభ: తొర్రూరు మున్సిపాలిటీ పరిధిలోని ఖమ్మం–వరంగల్ జాతీయ రహదారిపై గురువారం తెల్లవారుజామున ఓ లారీ అదుపుతప్పి రోడ్డు డివైడర్‌ను ఢీకొనడంతో మున్సిపల్ ఆస్తికి నష్టం వాటిల్లింది. అయితే ప్రభుత్వ ఆస్తి ధ్వంసమైనప్పటికీ సంబంధిత లారీపై ఇప్పటి వరకు మున్సిపాలిటీ అధికారులు ఎలాంటి కేసు నమోదు చేయకపోవడంపై స్థానికులు ప్రశ్నలు లేవనెత్తుతున్నారు.

ప్రభుత్వ ఆస్తి ధ్వంసమైన సందర్భాల్లో సంబంధిత వాహన యజమానుల నుంచి నష్టపరిహారం వసూలు చేయడంతో పాటు చట్టపరమైన చర్యలు తీసుకోవాల్సి ఉన్నప్పటికీ, ఈ ఘటనలో అలాంటి చర్యలు కనిపించకపోవడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. కొందరు అధికారులు మామూళ్లు తీసుకోవడం వల్లే ప్రాపర్టీ డ్యామేజ్ జరిగినా కేసులు నమోదు చేయడం లేదని స్థానికులు ఆరోపిస్తున్నారు.

ఖమ్మం–వరంగల్ ప్రధాన రహదారిపై తరచూ ప్రమాదాలు జరుగుతున్న నేపథ్యంలో డివైడర్లు, విద్యుత్ స్తంభాలు, ఇతర మున్సిపల్ ఆస్తులు దెబ్బతింటున్నా నష్టం చేసిన వాహనాలపై చర్యలు తీసుకోవడంలో అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ప్రజలు ఆరోపిస్తున్నారు. ఈ ఘటనపై సంబంధిత అధికారులు స్పందించి బాధ్యులపై చర్యలు తీసుకోవడంతో పాటు ప్రభుత్వ ఆస్తికి జరిగిన నష్టాన్ని వసూలు చేయాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.