పార్టీ బలోపేతంలో బీఎల్‌ఏల పాత్ర కీలకం: విశ్వనాథ్‌రావు
కాంగ్రెస్ బూత్ లెవల్ ఏజెంట్లకు గుర్తింపు కార్డుల పంపిణీ
జైనూర్ (ఆంధ్రప్రభ): కాంగ్రెస్ పార్టీ బలోపేతంలో బూత్ లెవల్ ఏజెంట్ల (బీఎల్‌ఏ) పాత్ర అత్యంత కీలకమని, ప్రతి ఒక్కరూ అంకితభావంతో పనిచేయాలని కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా జైనూర్ మార్కెట్ కమిటీ చైర్మన్ కుడిమెట్ విశ్వనాథ్‌రావు అన్నారు. గురువారం మండల కేంద్రంలోని మార్కెట్ కమిటీ కార్యాలయంలో జైనూర్, సిర్పూర్ (యు) గ్రామ పంచాయతీలకు చెందిన కాంగ్రెస్ పార్టీ బీఎల్‌ఏలకు గుర్తింపు కార్డులను పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పార్టీ బలోపేతంతో పాటు ప్రజా సమస్యలపై పోరాడడంలో బీఎల్‌ఏల పాత్ర ఎంతో ముఖ్యమని అన్నారు. కాంగ్రెస్ పార్టీ తమపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ బాధ్యతలను సమర్థవంతంగా నిర్వర్తించాలని సూచించారు. రానున్న రోజుల్లో పార్టీ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంలో బీఎల్‌ఏలు కీలకంగా వ్యవహరించాలని కోరారు.
ఈ కార్యక్రమంలో జైనూర్ మాజీ వైస్ ఎంపీపీ చిర్లే లక్ష్మణ్ యాదవ్, సిర్పూర్ (యు) మండల అధ్యక్షుడు ఆత్రం శంకర్, సీనియర్ నాయకులు ఆత్రం బాలేరావు, మెస్రం భూపతి, సోయం సోనేరావు, పెందూర్ సాహెబ్‌రావు, స్థానిక కాంగ్రెస్ పార్టీ నాయకులు, గ్రామ పంచాయతీలకు చెందిన ముఖ్య నాయకులు పాల్గొన్నారు.
