బీఎల్‌వోలకు సహకరించి ఓటు హక్కును పరిరక్షించుకోవాలి..

క్యాతన్‌పల్లి (ఆంధ్రప్రభ): ప్రత్యేక ఇంటెన్సివ్ రివిజన్ (ఎస్‌ఐఆర్) కార్యక్రమాన్ని విజయవంతంగా పూర్తి చేసేందుకు ప్రజలందరూ బీఎల్‌వోలకు సహకరించాలని, తమ విలువైన ఓటు హక్కును కోల్పోకుండా అవసరమైన వివరాలను సకాలంలో అందించాలని మందమర్రి తహసీల్దార్ సతీష్ కోరారు.

గురువారం ఆయన మాట్లాడుతూ.. క్యాతన్‌పల్లి మున్సిపాలిటీ పరిధిలో బీఎల్‌వోలు ఇంటింటికి వెళ్లి ఓటర్లకు ఎస్‌ఐఆర్ ఫారాలను అందజేస్తూ సర్వే నిర్వహిస్తున్నారని తెలిపారు. ప్రభుత్వం ఈ ప్రక్రియకు వారం రోజుల గడువు కల్పించిందని, అనంతరం బీఎల్‌వోలు తిరిగి ఓటర్ల వద్దకు వెళ్లి పూర్తిచేసిన ఫారాలు, అవసరమైన పత్రాలను సేకరిస్తారని చెప్పారు. ఫారం నింపడంలో ఇబ్బందులు ఉంటే బీఎల్‌వోలు, సూపర్వైజర్లు స్వయంగా సహాయం అందిస్తారని వివరించారు.

కొన్ని ప్రాంతాల్లో ఓటర్లు ఫారాలు అందలేదని ఫిర్యాదు చేసిన నేపథ్యంలో, ఓటరు ఇంట్లో లేనిపక్షంలో కనీసం మూడుసార్లు వెళ్లి ఫారం అందజేసేందుకు ప్రయత్నించాలని, సాధ్యం కాకపోతే ఫోన్ ద్వారా సమాచారం ఇవ్వాలని బీఎల్‌వోలకు సూచించినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామ పంచాయతీ అధికారి ప్రతిభ, మాజీ కౌన్సిలర్ కొక్కుల సతీష్, బీఎల్‌వో సంతోష్ రాణి, స్థానికులు పాల్గొన్నారు.