అంగన్వాడీ సెంటర్లలో కుళ్లిన కోడిగుడ్లే పౌష్టికాహారమా?
అంగన్వాడీ సెంటర్లలో కుళ్లిన కోడిగుడ్లే పౌష్టికాహారమా?
- కన్నెపల్లి మండలంలోని కేంద్రాల్లో కుళ్లిన గుడ్ల సరఫరా
- సూపర్వైజర్, సీడీపీఓలకు ఫిర్యాదు చేసినా స్పందన కరువు
- కాంట్రాక్టర్‌పై చర్యలు తీసుకోవాలని ప్రజల డిమాండ్
కన్నెపల్లి, ఆంధ్రప్రభ : మంచిర్యాల జిల్లా కన్నెపల్లి మండలంలోని అంగన్వాడీ సెంటర్లలో గర్భిణులు, బాలింతలు, చిన్నపిల్లలకు పంపిణీ చేస్తున్న కోడిగుడ్ల సరఫరాలో భారీ అక్రమాలు చోటుచేసుకుంటున్నాయి. ప్రభుత్వ నిబంధనల ప్రకారం నాణ్యమైన ఆహారం అందించాల్సి ఉండగా.. కాంట్రాక్టర్ల నిర్లక్ష్యం, అధికారుల పర్యవేక్షణ లోపం కారణంగా అంగన్వాడీ కేంద్రాలకు కుళ్లిన కోడిగుడ్లు సరఫరా అవుతున్న ఘటన బుధవారం వెలుగులోకి వచ్చింది.
వివరాల్లోకి వెళితే.. కన్నెపల్లి మండలంలోని జజ్జరవెల్లి గ్రామ పంచాయతీ పరిధిలోని అంగన్వాడీ సెంటర్లో ఒక బాలుడికి మంగళవారం 15 కోడిగుడ్లను పంపిణీ చేశారు. బుధవారం ఉదయం సదరు బాలుడి కుటుంబ సభ్యులు ఆ గుడ్లను ఉడకబెడుతుండగా, అందులోని ఒక కోడిగుడ్డు గంజులోనే పెద్ద శబ్దంతో పేలిపోయింది. దాంతో ఇల్లంతా భరించలేని దుర్గంధం నిండిపోయింది. గ్రామీణ ప్రాంతాల్లోని పిల్లల్లో పౌష్టికాహార లోపాన్ని నివారించేందుకు ప్రభుత్వం లక్షలాది రూపాయలు ఖర్చు చేస్తుంటే.. క్షేత్రస్థాయిలో మాత్రం సదరు కాంట్రాక్టర్ కుళ్లిన గుడ్లను సరఫరా చేస్తూ లక్షల్లో లాభాలు గడిస్తున్నాడని స్థానికులు మండిపడుతున్నారు.
అధికారుల తీరుపై సర్వత్రా విమర్శలు.. ఇలాంటి నాణ్యత లేని ఆహార పదార్థాల సరఫరాపై స్థానికులు మున్సిపల్ సూపర్వైజర్, సీడీపీఓల దృష్టికి తీసుకెళ్లే ప్రయత్నం చేసినప్పటికీ, వారు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తుండటంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. కాంట్రాక్టర్ నుంచి అధికారులకు ఏమైనా ముడుపులు అందుతున్నాయా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కన్నెపల్లి మండలంలోని సుమారు 30 అంగన్వాడీ సెంటర్లకు బట్వాన్పల్లికి చెందిన ఒక వ్యక్తి కోడిగుడ్లను సరఫరా చేస్తున్నాడని, అధికారులను తన గుప్పెట్లో ఉంచుకోవడం వల్లే ఈ అక్రమాలు సాగుతున్నాయనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి.
బయట అమ్ముకుంటున్న అంగన్వాడీ టీచర్లు..
మండలంలోని పలు సెంటర్లలో టీచర్లు కనీస సమయపాలన పాటించడం లేదని సమాచారం. ప్రభుత్వ నిబంధనల ప్రకారం పిల్లలకు అందజేయాల్సిన బియ్యం, పిండి, కోడిగుడ్లు, నూనె వంటి ఇతర వస్తువులను పిల్లలకు పెట్టకుండా, వాటిని యథేచ్ఛగా బయట అమ్ముకుంటున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. ఇవన్నీ జరుగుతున్నా ఉన్నతాధికారులు కళ్లకు గంతలు కట్టుకున్నట్లు వ్యవహరించడంపై ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా జిల్లా ఉన్నతాధికారులు స్పందించి, కన్నెపల్లి మండలంపై ప్రత్యేక దృష్టి సారించాలని, కుళ్లిన గుడ్లు సరఫరా చేస్తున్న కాంట్రాక్టర్ ఒప్పందాన్ని రద్దు చేసి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని, అలాగే టీచర్ల పనితీరును మార్చేలా చర్యలు చేపట్టాలని మండల ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.
