సీఎంఆర్ఎఫ్ ద్వారా పేదలకు మెరుగైన వైద్యసేవలు.

మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాదు
రూ.10.77 లక్షల విలువైన ఎల్‌ఓసీలు పంపిణీ.

విజయవాడ రూరల్, ఆంధ్రప్రభ : రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి సహాయ నిధి (సీఎంఆర్ఎఫ్) ద్వారా పేదలకు మెరుగైన వైద్యసేవలు అందించాలనే లక్ష్యంతో అందిస్తున్న ఆర్థిక సహాయం ఎంతో మందికి ప్రాణాధారంగా నిలుస్తోందని మైలవరం శాసనసభ్యులు వసంత వెంకట కృష్ణప్రసాదు అన్నారు. విజయవాడ రూరల్ మండలంలోని గొల్లపూడిలోని ఎమ్మెల్యే కార్యాలయంలో గురువారం నిర్వహించిన కార్యక్రమంలో సీఎంఆర్ఎఫ్ కింద మంజూరైన ఐదు ఎల్‌ఓసీలను లబ్ధిదారులకు ఎమ్మెల్యే అందజేశారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాదు మాట్లాడుతూ, ఆర్థిక ఇబ్బందుల కారణంగా వైద్య చికిత్సకు దూరమయ్యే పరిస్థితి ఎవరికీ రాకూడదనే సంకల్పంతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నాయకత్వంలోని కూటమి ప్రభుత్వం సీఎంఆర్ఎఫ్ పథకాన్ని సమర్థవంతంగా అమలు చేస్తోందన్నారు.

ప్రజలకు అవసరమైన సమయంలో ప్రభుత్వ సహాయం అందేలా నిరంతరం కృషి చేస్తున్నామని, అర్హులైన ప్రతి ఒక్కరికీ సంక్షేమ పథకాల ప్రయోజనాలు చేరేలా ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నామని పేర్కొన్నారు. ప్రజల సమస్యలను తమ సమస్యలుగా భావించి, ప్రతి కుటుంబానికి అండగా నిలవడం తమ బాధ్యతగా భావిస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో కొండపల్లికి చెందిన పంతగాని షాన్విత్‌కు రూ.3,02,924, జక్కంపూడికి చెందిన జానా సతీష్‌కు రూ.75,000, చలపారెడ్డి ఆనంద్‌కు రూ.1,00,000, కనిమెర్ల తండాకు చెందిన అజ్మీరా జ్యోతికి రూ.2,00,000, దాములూరుకు చెందిన షైక్ కరీముల్లా బాజీకి రూ.4,00,000 విలువైన ఎల్‌ఓసీలను ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాదు అందజేశారు. మొత్తం ఐదుగురు లబ్ధిదారులకు రూ.10,77,924ల విలువైన ఎల్‌ఓసీలు పంపిణీ చేశారు.

ఎల్‌ఓసీలు అందుకున్న లబ్ధిదారులు, వారి కుటుంబ సభ్యులు తమ వైద్య చికిత్సకు ఎంతో ఉపయోగపడే ఈ ఆర్థిక సహాయాన్ని అందించిన కూటమి ప్రభుత్వానికి, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకి, ఎమ్మెల్యే వసంత వెంకట కృష్ణప్రసాదుకి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో టీడీపీ సీనియర్ నాయకులు, టీడీపీ రాష్ట్ర మాజీ కార్యనిర్వాహక కార్యదర్శి బొమ్మసాని సుబ్బారావు, తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, కూటమి కుటుంబ సభ్యులు, లబ్ధిదారుల కుటుంబ సభ్యులు, తదితరులు పాల్గొన్నారు.