ఈనెల 21న వాహనాల బహిరంగ వేలం

ఈనెల 21న వాహనాల బహిరంగ వేలం
డీటీసీ యం పురేంద్ర…
విజయవాడ, ఆంధ్రప్రభ : రికార్డులు లేకుండా తిరుగుతూ పట్టుబడ్డ వాహనాలను ఈ నెల 21న బహిరంగ వేలం వెయ్యనున్నట్లు డీటీసీ యం పురేంద్ర ఒక ప్రకటనలో తెలిపారు. స్థానిక బందరు రోడ్డులోని డీటీసీ కార్యాలయం నుండి శనివారంనాడు ఒక పత్రిక ప్రకటనను విడుదల చేశారు. ఈ సందర్భంగా డీటీసీ యం పురేంద్ర మాట్లాడుతూ జిల్లాలో చేపట్టిన వాహన తనిఖీల్లో రికార్డులు లేకుండా పట్టుబడ్డ వాహనాలను సీజ్ చెయ్యడం జరిగిందని, సీ చేసిన వాహనాలకు నోటీసులు ఇచ్చిన కూడా యజమానులు ఎవ్వరు రాకపోవడంతో ఈనెల 21న సీ చేసిన వాహనాలను బహిరంగ వేలం వెయ్యనున్నట్లు డీటీసీ యం పురేంద్ర తెలిపారు.
ఈ నెల 21న ఉదయం 10 గం,, ల నుండి విద్యాదరపురం ఆర్టీసీ డిపో నందు వేలం నిర్వహించబడునని ఆయన తెలిపారు. మోటార్ సైకిల్ –1,, కార్లు 1, మ్యాక్సీ క్యాబ్ 1, గుడ్స్ వాహనాలు 5, ఆటో రిక్షాలు 9, వేలంలో ఉన్నాయని, మొత్తం 17 వాహనాలన్నారు. వాహనాల వేలంనకు ముందు ధరావత్తు సొమ్ముగా ఐదు వేల రూపాయిలు నగదును చెల్లించి గుర్తింపు కార్డుల ఫోటో స్టాట్ కాపీని ఇవ్వాలన్నారు. వేలంలో వాహనాలను పాడుకున్న రోజే మొత్తం సొమ్మును చెల్లించాలన్నారు.
అదేరోజు చెల్లించని యెడల ధరావత్తు సొమ్ముగా చెల్లించిన ఐదు వేల రూపాయలను తిరిగి ఇవ్వబడదని, అదే వాహనాన్ని మరల తిరిగి వేలం నిర్వహించడం జరుగుతుందని డీటీసీ తెలిపారు. వేలంలో పాడుకున్న వాహనాలకు జిఎస్టి పన్నును చెల్లించి వాటి రశీదును డీటీసీ కార్యాలయంలో అందజేయాలన్నారు. బహిరంగ వేలంలో ఉన్న వాహనాలకు యజమానులు గాని సంబందిత ఫైనాన్షియల్స్ గాని ప్రభుత్వానికి చెల్లించవలసిన బకాయలను వాహనాల వేలంనకు ముందు రోజులోపు డీటీసీ కార్యాలయంలో సంబంధిత అధికారులను సంప్రదించి చెల్లించవచ్చన్నారు. వాహనాల బహిరంగ వేలంను కూడా నిలుపుదల చేసే అధికారం అక్కడ వేలం నిర్వహించే అధికారులకు ఉందని డీటీసీ యం పురేంద్ర తెలిపారు.
