వైద్యుల దినోత్సవాన అరుదైన ఘనత..
- ఉస్మానియా వైద్యుల ఘనతపై సీఎం ప్రశంసలు
ఆంధ్రప్రభ, హైదరాబాద్ : 36 గంటలపాటు శ్రమించి ఒకే రోగికి ఐదు అవయవాల మార్పిడి శస్త్రచికిత్సలను విజయవంతంగా నిర్వహించిన ఉస్మానియా జనరల్ ఆస్పత్రి వైద్యులు, నర్సింగ్, సాంకేతిక సిబ్బందిని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అభినందించారు. సిరిసిల్లకు చెందిన 30 ఏళ్ల యువ ఇంజనీర్‌కు జీర్ణాశయం, డ్యూడెనమ్ (ఆంత్రమూలం), ప్యాంక్రియాస్, చిన్నపేగు, పెద్దపేగు అవయవాలను ఒకేసారి విజయవంతంగా మార్పిడి చేసి దేశంలోనే అరుదైన ఘనతను సాధించారని సీఎం ప్రశంసించారు.
జాతీయ వైద్యుల దినోత్సవం రోజున ఉస్మానియా వైద్య బృందం ఈ అరుదైన విజయాన్ని నమోదు చేయడం గర్వకారణమని పేర్కొన్నారు. ఈ ఘనతతో వైద్యులు తమ నైపుణ్యం, అంకితభావాన్ని మరోసారి చాటారని, వైద్య వృత్తికి ఆదర్శంగా నిలిచారని కొనియాడారు. రోగికి కొత్త జీవితాన్ని అందించిన వైద్యులు, ఇతర సిబ్బంది సేవలను ముఖ్యమంత్రి ప్రత్యేకంగా అభినందిస్తూ, భవిష్యత్తులోనూ ఇలాంటి సేవలను కొనసాగించాలని ఆకాంక్షించారు.
