122 kilometers | రూ.7 వేల కోట్లు పెరిగిన మెట్రో వ్యయం

122 kilometers | రూ.7 వేల కోట్లు పెరిగిన మెట్రో వ్యయం

122 kilometers | ఆంధ్రప్రభ, వెబ్‌డెస్క్: మెట్రో ప్రాజెక్టును బీజేపీ నేత కిషన్ రెడ్డి అడ్డుకుంటున్నారని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. కిషన్ రెడ్డి కేసీఆర్ కు లొంగిపోయి అడ్డుపడుతున్నారన్నారు. ఆ ప్రాజెక్టు ఆలస్యం కావడంతో మెట్రో వ్యయం రూ.7వేల కోట్లు పెరిగిందన్నారు. హైదరాబాద్‌ను ప్రపంచ స్థాయి నగరంగా అభివృద్ధి చేయాలంటే అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన రవాణా వ్యవస్థ అవసరమని రేవంత్‌రెడ్డి అన్నారు. సీఎం రేవంత్ రెడ్డి తెలంగాణ సచివాలయంలో మీడియాతో మాట్లాడుతూ… మెట్రో రైలు విస్తరణపై గత, ప్రస్తుత ప్రభుత్వాల పాత్రను ప్రస్తావిస్తూ పలు కీలక వ్యాఖ్యలు చేశారు.

ఉమ్మడి రాష్ట్రంలోనే హైదరాబాద్ అభివృద్ధికి కాంగ్రెస్ ప్రభుత్వం పునాది వేసిందని, మెట్రో రైలు ప్రాజెక్టును కూడా కాంగ్రెస్ హయాంలోనే ప్రారంభించామని తెలిపారు. రూ.15 వేల కోట్ల అంచనాతో ప్రారంభమైన ప్రాజెక్టు, తర్వాతి ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా ఆలస్యమైందని ఆరోపించారు. 2014 నుంచి 2017 మధ్య మెట్రో పనులు పూర్తిగా నిలిచిపోయాయని, అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ వివిధ కారణాలు చూపుతూ ప్రాజెక్టును మూడేళ్లు ఆలస్యం చేశారని విమర్శించారు. దీంతో ప్రాజెక్టు వ్యయం సుమారు రూ.7 వేల కోట్లు పెరిగిందన్నారు.

కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే మెట్రో రెండో దశ విస్తరణపై దృష్టి సారించిందని చెప్పారు. ప్రజల అవసరాలకు అనుగుణంగా మెట్రో నెట్‌వర్క్ విస్తరించాల్సిన అవసరం ఉందన్నారు. 122 కిలోమీటర్ల విస్తరణ ప్రణాళికకు ఎల్‌అండ్‌టీ ఆసక్తి చూపలేదని వెల్లడించారు.

తొలి దశ మెట్రో ప్రాజెక్టులోనే ఏటా రూ.400 కోట్లకు పైగా నష్టాలు వస్తున్నాయని ఎల్‌అండ్‌టీ తెలిపిందన్నారు. రెండో దశలో భాగస్వామ్యం కావడానికి కూడా సంస్థ నిరాకరించిందని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో మెట్రో ఆస్తుల కొనుగోలు ప్రక్రియను ప్రభుత్వం ముందుకు తీసుకెళ్లిందని వివరించారు. మెట్రో ప్రాజెక్టుకు సంబంధించిన రుణ బదిలీ ప్రక్రియ కోసం అవసరమైన డాక్యుమెంట్ ఫీజులు చెల్లించామని, ఈక్విటీ కింద రూ.1,400 కోట్లు జమ చేశామని తెలిపారు. రూ.13,400 కోట్ల రుణాన్ని 4 శాతం వడ్డీతో 20 ఏళ్ల కాలపరిమితికి పొందేందుకు చర్యలు తీసుకున్నామని చెప్పారు.

అయితే కేంద్ర రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్‌ను కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి కలిసి రుణ బదిలీ ప్రక్రియను అడ్డుకున్నారని సీఎం ఆరోపించారు. తెలంగాణకు సంబంధించిన మెట్రో విస్తరణకు కేంద్రం సహకరిస్తుందా లేదా అన్నది స్పష్టం చేయాలని డిమాండ్ చేశారు. మెట్రో ప్రాజెక్టు పురోగతికి ఆటంకాలు కల్పించడం సరికాదన్నారు.