సైబర్ నేరాలపై అప్రమత్తంగా ఉండాలి

  • సైబర్ సెక్యూరిటీ బ్యూరో డీఎస్పీ ఎన్.వేణుగోపాల్ రెడ్డి
  • సైబర్ జాగృకత దినోత్సవం, డాక్టర్స్ డే సందర్భంగా అవగాహన కార్యక్రమం

సంగారెడ్డి ప్రతినిధి, ఆంధ్రప్రభ: సైబర్ నేరాలపై అప్రమత్తంగా ఉండాలని సైబర్ సెక్యూరిటీ బ్యూరో డీఎస్పీ ఎన్.వేణుగోపాల్ రెడ్డిఎన్.వేణుగోపాల్ అన్నారు. సైబర్ జాగ్రుకత దినోత్సవం, జాతీయ వైద్యుల దినోత్సవాన్ని పురస్కరించుకుని తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో, సంగారెడ్డి జిల్లా పోలీసు శాఖ సంయుక్త ఆధ్వర్యంలో బుధవారం సంగారెడ్డి పట్టణంలోని ఎంఎన్‌ఆర్ మెడికల్ కళాశాలలో వైద్యులు, జూనియర్ డాక్టర్లు, వైద్య విద్యార్థులకు సైబర్ సేఫ్ డాక్టర్ పేరుతో సైబర్ నేరాల నివారణపై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు.

ఈ సందర్భంగా డీఎస్పీ ఎన్.వేణుగోపాల్ రెడ్డి మాట్లాడుతూ ప్రస్తుతం వైద్యులు పెట్టుబడి మోసాలు, డిజిటల్ అరెస్ట్ పేరుతో జరిగే మోసాలు, నకిలీ పోలీసు, ప్రభుత్వ అధికారుల పేరుతో మోసాలు, ఫిషింగ్ లింకులు, ఓటీపీ, కేవైసీ మోసాలు, సోషల్ మీడియా మోసాలు, నకిలీ మొబైల్ యాప్‌ల ద్వారా జరిగే సైబర్ నేరాలకు ఎక్కువగా గురవుతున్నారని తెలిపారు. ముఖ్యంగా ఇటీవల పెరుగుతున్న బాస్ స్కామ్ పట్ల వైద్యులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

ఆసుపత్రి డీన్, సూపరింటెండెంట్, విభాగాధిపతి లేదా ఇతర ఉన్నతాధికారుల పేరుతో వాట్సాప్, ఎస్‌ఎంఎస్ లేదా ఈ-మెయిల్ ద్వారా అత్యవసరంగా డబ్బు పంపాలని లేదా గిఫ్ట్ కార్డులు కొనుగోలు చేయాలని కోరుతూ సైబర్ నేరగాళ్లు మోసాలకు పాల్పడుతున్నారని వివరించారు. ఇలాంటి సందేశాలు వచ్చినప్పుడు సంబంధిత అధికారిని నేరుగా సంప్రదించి ధృవీకరించిన తర్వాత మాత్రమే స్పందించాలని సూచించారు.

ఆన్లైన్ సందేశాలను నమ్మొద్దు

అనుమానాస్పద ఫోన్ కాల్స్, లింకులు, వాట్సాప్ సందేశాలను నమ్మవద్దని, ఓటీపీ, యూపీఐ పిన్, బ్యాంకు ఖాతా వివరాలు వంటి గోప్యమైన సమాచారాన్ని ఎవరికీ వెల్లడించవద్దని తెలిపారు. పెట్టుబడులు పెట్టే ముందు సంబంధిత సంస్థ విశ్వసనీయతను పూర్తిగా పరిశీలించాలని, బలమైన పాస్‌వర్డ్లు, టూ-ఫ్యాక్టర్ ఆథెంటికేషన్ (2FA) వంటి భద్రతా చర్యలను తప్పనిసరిగా అమలు చేయాలని సూచించారు.

సైబర్ మోసానికి గురైన వెంటనే 1930 సైబర్ హెల్ప్‌లైన్‌కు ఫోన్ చేయాలని లేదా www.cybercrime.gov.in వెబ్‌సైట్‌లో ఫిర్యాదు నమోదు చేయాలని చెప్పారు. సైబర్ మోసం జరిగిన తొలి గంట (గోల్డెన్ అవర్)లోనే ఫిర్యాదు చేస్తే నష్టపోయిన నగదును తిరిగి పొందే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని వివరించారు. ఈ కార్యక్రమంలో సైబర్ సెక్యూరిటీ బ్యూరో ఇన్‌స్పెక్టర్ కె.ఎస్.రవి, ఐటీ సెల్ సీఐ నిరంజన్ రెడ్డి, సంగారెడ్డి రూరల్ ఎస్‌ఐ మధుసూదన్ రెడ్డి, ఎంఎన్‌ఆర్ మెడికల్ కళాశాల ప్రిన్సిపాల్ డా.వినయ్ రెడ్డి, డీ4సీ బృందం, సుమారు 75 మంది వైద్యులు, జూనియర్ డాక్టర్లు, వైద్య విద్యార్థులు పాల్గొన్నారు.