టూరిజమే ఏపీ భవిష్యత్తు..
రెండేళ్లలో రూ.20 వేల కోట్ల పెట్టుబడులు
పర్యాటక రంగంలో విప్లవాత్మక మార్పులు
దేశంలో 13వ స్థానం లో ఏపీ
1.22 లక్షల ఉద్యోగాల లక్ష్యం
పర్యాటక సాంస్కృతిక సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్
(ఆంధ్రప్రభ, ఎన్టీఆర్ బ్యూరో): పర్యాటక రంగాన్ని రాష్ట్ర ఆర్థికాభివృద్ధికి ప్రధాన చోదకశక్తిగా మార్చే లక్ష్యంతో కూటమి ప్రభుత్వం గత రెండేళ్లలో విప్లవాత్మక నిర్ణయాలు తీసుకుందని రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్ పేర్కొన్నారు. పర్యాటక రంగానికి పారిశ్రామిక హోదా కల్పించడం నుంచి భారీ పెట్టుబడుల ఆకర్షణ వరకు, జాతీయ స్థాయి అవార్డుల నుంచి ప్రపంచ స్థాయి పర్యాటక గమ్యస్థానంగా రాష్ట్రాన్ని తీర్చిదిద్దే దిశగా ప్రభుత్వం వేగంగా అడుగులు వేస్తోందన్నారు. రెండేళ్ల పాలనలో శాఖల వారీగా సాధించిన ప్రగతిని వివరించిన మంత్రి దుర్గేష్, రాష్ట్రంలో పర్యాటక రంగం కొత్త శకానికి శ్రీకారం చుట్టిందన్నారు. 2019-24 మధ్య పర్యాటక రంగం వెనుకబడిపోయినప్పటికీ, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పరిస్థితి పూర్తిగా మారిపోయిందని చెప్పారు. గత రెండేళ్లలో దేశీయ పర్యాటకుల రాక 17 శాతం పెరిగి 37 కోట్ల ఫుట్‌ఫాల్ నమోదైందని, విదేశీ పర్యాటకుల సంఖ్య 2.62 లక్షలకు చేరిందని వెల్లడించారు. ఫలితంగా దేశంలో 16వ స్థానంలో ఉన్న ఆంధ్రప్రదేశ్ పర్యాటక రంగం 13వ స్థానానికి చేరుకుందని తెలిపారు.
.. పర్యాటకంలో పెట్టుబడుల జోష్…
రాష్ట్రంలో పెట్టుబడుల ప్రవాహం పెంచేందుకు పర్యాటక రంగానికి పారిశ్రామిక హోదా కల్పించి 2024-29 టూరిజం పాలసీ అమలు చేస్తున్నామని మంత్రి చెప్పారు. దీని ఫలితంగా 117 ప్రముఖ సంస్థలతో ఒప్పందాలు కుదిరాయని, రూ.20 వేల కోట్లకు పైగా పెట్టుబడులు ఆకర్షించగలిగామని మంత్రి దుర్గేష్ వెల్లడించారు. ఈ ప్రాజెక్టులు పూర్తిస్థాయిలో అమలైతే 1,22,637 మందికి ఉపాధి అవకాశాలు లభిస్తాయని పేర్కొన్నారు. ప్రస్తుతం ఉన్న 4,390 హోటల్ గదులకు అదనంగా మరో 9,042 గదులు అందుబాటులోకి వచ్చేలా 50 కొత్త హోటళ్లకు అనుమతులు ఇచ్చామని తెలిపారు. ఐదేళ్లలో రాష్ట్రవ్యాప్తంగా 50 వేల గదులు ఏర్పాటు చేయడమే ప్రభుత్వ లక్ష్యమన్నారు. ఈ లక్ష్యం నెరవేరితే దేశంలో టాప్-5 పర్యాటక రాష్ట్రాల్లో ఏపీ నిలుస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. పర్యాటక అభివృద్ధిలో భాగంగా విశాఖపట్నం, అరకు, రాజమహేంద్రవరం, అమరావతి, శ్రీశైలం, గండికోట, తిరుపతిని యాంకర్ హబ్‌లుగా అభివృద్ధి చేస్తున్నామని, 25 ప్రత్యేక పర్యాటక సర్క్యూట్ల రూపకల్పన జరుగుతోందని వెల్లడించారు. క్రూయిజ్ టూరిజం, క్యారవాన్ టూరిజం, హోమ్‌స్టేలు, అడ్వెంచర్ టూరిజం, వెల్‌నెస్ టూరిజం వంటి రంగాల్లో ప్రత్యేక కార్యాచరణ అమలు చేస్తున్నట్లు చెప్పారు.
పర్యాటకుల భద్రతకు అత్యున్నత ప్రాధాన్యం ఇస్తూ ప్రత్యేక బీచ్ ప్రొటెక్షన్ ఫోర్స్ ఏర్పాటు చేశామని తెలిపారు. తీర ప్రాంతాల్లో భద్రతా ప్రమాణాలు పెంచి పర్యాటకులకు మరింత రక్షణ కల్పిస్తున్నామని చెప్పారు. అలాగే రాష్ట్రవ్యాప్తంగా 1,855 హోమ్‌స్టేలను అనుసంధానం చేస్తూ ప్రత్యేక హోమ్‌స్టే పోర్టల్‌ను సిద్ధం చేశామని వివరించారు. ఆధ్యాత్మిక పర్యాటకాన్ని ప్రోత్సహించే క్రమంలో రాష్ట్రంలోని 21 ప్రధాన ఆలయాల వద్ద టెంట్ సిటీల ఏర్పాటు ప్రతిపాదనను అమలు చేస్తున్నామని మంత్రి వెల్లడించారు. అన్నవరం, సింహాచలం, అహోబిలం, నాగార్జునసాగర్ బౌద్ధ సర్క్యూట్ వంటి ప్రాజెక్టులకు కేంద్ర ప్రభుత్వం భారీ నిధులు మంజూరు చేసిందని తెలిపారు. గోదావరి తీర అభివృద్ధి, గండికోట, సూర్యలంక బీచ్ అభివృద్ధి వంటి ప్రాజెక్టులు వేగంగా ముందుకు సాగుతున్నాయని చెప్పారు.
.. జాతీయ స్థాయిలో ఏపీ పర్యాటకానికి గుర్తింపు..
రాష్ట్ర పర్యాటక రంగానికి జాతీయ స్థాయిలో గుర్తింపు లభిస్తోందని మంత్రి దుర్గేష్ తెలిపారు. ఇటీవల కేరళలో జరిగిన జాతీయ సదస్సులో ఆంధ్రప్రదేశ్‌కు ‘బెస్ట్ టూరిజం ప్రమోషన్ స్టేట్’ అవార్డు దక్కిందని తెలిపారు. అరకు వ్యాలీకి ‘ఇన్‌స్టాగ్రామబుల్ ల్యాండ్‌స్కేప్’ అవార్డు రావడం మరో గర్వకారణమన్నారు.
.. సాంస్కృతికానికి పూర్వ వైభవం..
సాంస్కృతిక రంగానికి కూడా ప్రభుత్వం పునర్వైభవం తీసుకొచ్చిందని మంత్రి పేర్కొన్నారు. రెండేళ్లలో రెండు విడతలుగా కళారత్న, ఉగాది పురస్కారాలు ప్రదానం చేశామని మంత్రి కందుల దుర్గేష్ తెలిపారు. అల్లూరి సీతారామరాజు, గురజాడ అప్పారావు, ఘంటసాల, గుర్రం జాషువా, టంగుటూరి ప్రకాశం పంతులు తదితర మహనీయుల జయంతి, వర్ధంతులను ఘనంగా నిర్వహించామని చెప్పారు. కళాకారుల పెన్షన్ల పునరుద్ధరణ, కూచిపూడి నృత్య ఉపాధ్యాయుల పథకం పునరుద్ధరణకు చర్యలు తీసుకుంటున్నట్లు వెల్లడించారు.
.. సింగిల్ విండో విధానంలో..
సినిమా రంగ అభివృద్ధికి ప్రత్యేక ప్రాధాన్యం ఇస్తున్నామని పేర్కొన్న మంత్రి కందుల దుర్గేష్, గతంలో ప్రకటించి పంపిణీ చేయని నంది అవార్డులతో పాటు 2025 సంవత్సరం నుంచి మళ్లీ నంది అవార్డులను ప్రారంభించనున్నట్లు ప్రకటించారు. ఈ ఏడాది నవంబర్-డిసెంబర్ నెలల్లో నంది నాటకోత్సవాలను తప్పనిసరిగా నిర్వహిస్తామని స్పష్టం చేశారు. తెలుగు సినిమా పరిశ్రమకు అవసరమైన డబ్బింగ్ థియేటర్లు, రీరికార్డింగ్ స్టూడియోలు, ఆధునిక చిత్రీకరణ కేంద్రాల ఏర్పాటుకు ప్రభుత్వం ప్రోత్సాహం అందిస్తోందన్నారు. సింగిల్ విండో విధానంలో భూములు కేటాయించి సినీ పరిశ్రమను ఆంధ్రప్రదేశ్‌లో విస్తరించేందుకు చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు.
.. ఏపీకి ప్రత్యేక బ్రాండ్..
పర్యాటకం, సంస్కృతి, సినిమా రంగాల సమన్వయంతో రాష్ట్రానికి ప్రత్యేక బ్రాండ్ ఇమేజ్ తీసుకురావడమే ప్రభుత్వ లక్ష్యమని మంత్రి కందుల దుర్గేష్ పేర్కొన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చెప్పినట్లుగా “అన్ని ఈజాలు చూశాం.. ఇక మిగిలింది టూరిజమే” అనే నినాదంతో ఆంధ్రప్రదేశ్‌ను ప్రపంచ పర్యాటక పటంలో అగ్రస్థానానికి తీసుకెళ్లేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. ఈ సమావేశంలో స్పెషల్ సిఎస్ అజయ్ జైన్, టూరిజం ఇంచార్జ్ ఎండీ పద్మావతి, టూరిజం ఇతర శాఖలకు చెందిన అధికారులు పాల్గొన్నారు.
