మరింత బలంగా విజయవాడ టిడిపి..
మరింత బలంగా విజయవాడ టిడిపి..
పార్టీలో చేరేందుకు అందరిలోనూ ఆసక్తి..
చేరిక కోసం ఇప్పటికే చెంతడంత లిస్ట్..
వెయిటింగ్ లో ముఖ్య నాయకులు..
విజయవాడ ఎంపీ కేసినేని చిన్ని.
వైసీపీ నుంచి టీడీపీలోకి వలసలు
వందమందికి పైగా శ్రేణుల చేరిక
పశ్చిమ నియోజకవర్గంలో గ్రూపు రాజకీయాలకు చెక్
ఇళ్ల పట్టాల పంపిణీపై కీలక ప్రకటన
ఆంధ్రప్రభ ఎన్టీఆర్ బ్యూరో : ఎన్టీఆర్ జిల్లా వ్యాప్తంగా తెలుగుదేశం పార్టీ మరింత బలోపేతం అవుతుందని విజయవాడ పార్లమెంట్ సభ్యులు కేసినేని శివనాథ్ పేర్కొన్నారు. పార్టీలో చేరేందుకు వివిధ పార్టీల నుండి ఇప్పటికే ఎంతోమంది ఆసక్తి చూపిస్తున్నారు అన్న ఆయన, ప్రస్తుతం వెయిటింగ్ లో ముఖ్య నాయకులకు కూడా ఉన్నట్లు సంచలన ప్రకటన చేశారు. విజయవాడ రాజకీయాల్లో మరోసారి చేరికల సందడి కనిపించింది. కేశినేని చిన్ని ఆధ్వర్యంలో సుమారు వందమందికి పైగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు తెలుగుదేశం పార్టీలో చేరారు. పార్టీ కండువాలు కప్పి వారిని పార్టీలోకి ఎంపీ సాదరంగా స్వాగతం పలికారు.

ఈ సందర్భంగా నిర్వహించిన మీడియా సమావేశంలో ఎంపీ పలు కీలక వ్యాఖ్యలు చేశారు. విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో పార్టీ బలోపేతమే లక్ష్యంగా అందరూ సమిష్టిగా పనిచేస్తున్నామని, గ్రూపు రాజకీయాలకు ఎలాంటి అవకాశం లేదని స్పష్టం చేశారు. పార్టీ అభివృద్ధి, ప్రభుత్వ పనితీరు చూసే ఇతర పార్టీల కార్యకర్తలు కూడా స్వచ్ఛందంగా టీడీపీ వైపు వస్తున్నారని పేర్కొన్నారు. జీఓ-30 ప్రకారం ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమాన్ని త్వరలో చేపడతామని, సుమారు 45 వేల కుటుంబాలకు లబ్ధి చేకూరేలా చర్యలు కొనసాగుతున్నాయని తెలిపారు. మూడు నెలల్లో క్రమబద్ధీకరణ ప్రక్రియ పూర్తి చేసి, ముఖ్యమంత్రి చేతుల మీదుగా పట్టాల పంపిణీ చేపట్టేలా కార్యాచరణ రూపొందిస్తున్నామని వెల్లడించారు. విజయవాడ నగరానికి సంబంధించిన పలు సమస్యలను రాష్ట్ర ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లామని, అభివృద్ధి పనులకు ప్రత్యేక ప్రాధాన్యం కల్పిస్తున్నామని చెప్పారు. ఇదే సమయంలో వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డిపై విమర్శలు చేస్తూ, రాష్ట్రంలో అపోహలు సృష్టించే ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆరోపించారు. అలాగే అమరావతి అభివృద్ధి పనులు వేగంగా కొనసాగుతున్నాయని, రానున్న సంవత్సరాల్లో శాసనసభ, హైకోర్టు నిర్మాణాలు పూర్తయ్యే దిశగా ప్రభుత్వం ముందుకెళ్తోందని ఎంపీ పేర్కొన్నారు. అమరావతినే రాష్ట్ర రాజకీయ, పరిపాలనా కేంద్రంగా తీర్చిదిద్దడమే లక్ష్యమని స్పష్టం చేశారు.
