Cabinet Meeting | కేంద్రానికి తెలంగాణ విజ్ఞప్తి..
Cabinet Meeting | కేంద్రానికి తెలంగాణ విజ్ఞప్తి..
- రాష్ట్రంలో పండిన ధాన్యమంతా కొనుగోలు చేయాలి..
- రామగుండం యూరియాలో అధిక వాటా తెలంగాణకే ఇవ్వాలి
Cabinet Meeting | ఆంధ్రప్రభ, వెబ్‌డెస్క్: రైతు భరోసా, సన్న ధాన్యానికి బోనస్‌పై నిర్ణయాలు తీసుకున్న మంత్రివర్గ ఉపసంఘం సమావేశం అనంతరం మంత్రులు ఎన్. ఉత్తమ్ కుమార్ రెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు, ధనసరి అనసూయ (సీతక్క) మీడియాతో మాట్లాడారు. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే తెలంగాణ నుంచి కేంద్ర ప్రభుత్వం తక్కువ ధాన్యాన్ని సేకరిస్తోందని సమావేశంలో ఆందోళన వ్యక్తమైనట్లు వెల్లడించారు.
రాష్ట్రంలో రైతులు పండించిన మొత్తం ధాన్యాన్ని కేంద్ర ప్రభుత్వం కొనుగోలు చేయాలని సమావేశం కోరినట్లు తెలిపారు. కేంద్రం నిర్దేశించిన విధివిధానాల ప్రకారం పంట ఉత్పత్తుల కొనుగోలుకు తెలంగాణ ప్రభుత్వం సిద్ధంగా ఉందని, భవిష్యత్తులో కూడా రైతులకు ఇబ్బందులు లేకుండా కేంద్రం కొనుగోలు కోటాను కొనసాగించాలని అభిప్రాయపడినట్లు పేర్కొన్నారు.
వానాకాలం సాగు సీజన్ ప్రారంభమైన నేపథ్యంలో రాష్ట్రానికి కేటాయించాల్సిన ఎరువుల కోటాను వెంటనే విడుదల చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని సమావేశం కోరింది. ఈ అంశంపై ఇప్పటికే పలుమార్లు కేంద్రానికి లేఖలు రాసినట్లు, అవసరమైతే త్వరలో ఢిల్లీకి వెళ్లి కేంద్ర మంత్రులను మరోసారి కలవాలని నిర్ణయించినట్లు మంత్రులు తెలిపారు.
అలాగే తెలంగాణలోని రామగుండం ఫర్టిలైజర్స్ అండ్ కెమికల్స్ లిమిటెడ్ (RFCL)లో ఉత్పత్తి అవుతున్న యూరియాలో అత్యధిక వాటాను తెలంగాణకే కేటాయించాలని సమావేశం డిమాండ్ చేసింది. ఇక్కడ తయారవుతున్న యూరియాను ఇతర రాష్ట్రాలకు తరలించకుండా తెలంగాణ రైతుల అవసరాల కోసం వినియోగిస్తే రవాణా వ్యయం కూడా తగ్గుతుందని సమావేశం అభిప్రాయపడింది.
