CM | రైతు భరోసా నిధులకు గ్రీన్ సిగ్నల్
CM | రైతు భరోసా నిధులకు గ్రీన్ సిగ్నల్
- జూన్ 30న మధిర వేదికగా ఖాతాల్లో జమ..
- 7 రకాల సన్నాలకు బోనస్
CM | ఆంధ్రప్రభ, వెబ్‌డెస్క్ : వానాకాలం సాగుకు రైతులకు పెట్టుబడి సాయంగా రైతు భరోసా నిధులను విడుదల చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరిగిన మంత్రివర్గ ఉపసంఘం సమావేశం నిర్ణయించింది. ఈ నెల 30న ఖమ్మం జిల్లా మధిరలో భారీ స్థాయిలో రైతుల సమ్మేళనం నిర్వహించి, అదే వేదికపై రైతు భరోసా నిధుల జమ ప్రక్రియను ప్రారంభించాలని తీర్మానించింది. రైతులకు ప్రోత్సాహం అందించే మరో కీలక నిర్ణయం కూడా ప్రభుత్వం తీసుకుంది. సన్న ధాన్యం సాగును ప్రోత్సహించేందుకు ఏడు రకాల సన్నాలకు బోనస్ చెల్లించాలని నిర్ణయించింది.
మార్కెట్ డిమాండ్, వినియోగదారుల ఆదరణ, అధిక దిగుబడి వంటి అంశాలను పరిగణనలోకి తీసుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రభుత్వం తెలిపింది. బీపీటీ-5204, ఆర్‌ఎన్‌ఆర్-15048, హెచ్‌ఎంటీ సోనా, జై శ్రీరామ్, కేఎన్‌ఎం-1638, డబ్ల్యూజీఎల్-44, కేఎన్‌ఎం-7715 రకాల సన్న ధాన్యాలకు బోనస్ వర్తించనుంది. ఈ సందర్భంగా రాష్ట్రంలో ధాన్యం ఉత్పత్తి, కొనుగోళ్లపై కూడా ప్రభుత్వం సంతృప్తి వ్యక్తం చేసింది. ఈ ఏడాది తెలంగాణ రైతులు దేశంలోనే రికార్డు స్థాయిలో అత్యధిక ధాన్యం పండించారని పేర్కొంది. గతంలో ఎన్నడూ లేని విధంగా ఈ సీజన్‌లో ప్రభుత్వం ఇప్పటికే దాదాపు 80 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేసినట్లు వెల్లడించింది.
