Indian Navy | నౌకాదళంలో కొత్త శక్తి

Indian Navy | నౌకాదళంలో కొత్త శక్తి

Indian Navy | సముద్ర భద్రతకు స్వదేశీ నౌకలతో భారీ బలోపేతం
ఐఎన్‌ఎస్ దూనగిరి, సంశోధక్, అగ్రయ్ ప్రత్యేకతలేమిటి?
ఆత్మనిర్భర్ భారత్‌కు నౌకాదళ ఆధునీకరణ ప్రతీక
ప్రపంచ సముద్ర శక్తిగా భారత్ ఎదుగుదలకు కొత్త అధ్యాయం

Indian Navy | “భూమిపై సురక్షితంగా ఉండాలంటే, మనం సముద్రంలో సర్వోన్నతంగా ఉండాలి” అనే భావన నేటి భౌగోళిక, వ్యూహాత్మక పరిస్థితుల్లో మరింత ప్రాధాన్యతను సంతరించుకుంది. సుమారు 7,500 కిలోమీటర్ల తీరరేఖ, రెండు మిలియన్ చదరపు కిలోమీటర్లకు పైగా ప్రత్యేక ఆర్థిక మండలం, విశాలమైన ద్వీప భూభాగాలు, అపారమైన సముద్ర సంపద కలిగిన దేశంగా భారతదేశానికి సముద్ర భద్రత అత్యంత కీలకం. దేశ విదేశీ వాణిజ్యంలో 97 శాతానికి పైగా సముద్ర మార్గాల ద్వారానే జరుగుతుండటంతో సముద్ర మార్గాల రక్షణ జాతీయ ప్రయోజనాలకు నేరుగా అనుసంధానమై ఉంది.

“సమ్ నో వరుణః” — వరుణ భగవానుడు మాకు శుభప్రదంగా ఉండుగాక అనే వేద సందేశాన్ని స్పూర్తిగా తీసుకుంటూ భారత నౌకాదళం స్వావలంబన దిశగా మరో కీలక మైలురాయిని చేరుకుంది. దేశ సముద్ర భద్రతను మరింత బలోపేతం చేస్తూ, స్వదేశీ రక్షణ తయారీ సామర్థ్యానికి ప్రతీకలుగా నిలిచే మూడు అత్యాధునిక నౌకలు నౌకాదళంలో చేరాయి. స్టెల్త్ యుద్ధ నౌక ఐఎన్‌ఎస్ దూనగిరి, భారీ సర్వే నౌక ఐఎన్‌ఎస్ సంశోధక్, జలాంతర్గామి విధ్వంసక నౌక ఐఎన్‌ఎస్ అగ్రయ్ చేరికతో భారత నౌకాదళ కార్యాచరణ సామర్థ్యాలు మరింత విస్తరించనున్నాయి.

ప్రపంచ వాణిజ్యం, డిజిటల్ కమ్యూనికేషన్ నెట్‌వర్క్‌లు, ఇంధన సరఫరా వ్యవస్థలు, భవిష్యత్తు ఖనిజ వనరులు అన్నీ సముద్రాలతో ముడిపడి ఉన్న నేపథ్యంలో బలమైన నౌకాదళం ఏ దేశానికైనా వ్యూహాత్మక ఆధిపత్యానికి ప్రధాన ఆధారం. ఈ వాస్తవాన్ని దృష్టిలో ఉంచుకుని భారతదేశం తన సముద్ర శక్తిని ఆధునీకరించడంపై ప్రత్యేక దృష్టి సారిస్తోంది. స్వదేశీ సాంకేతికత, స్వావలంబన, ఆధునిక రక్షణ తయారీ రంగాల్లో దేశం సాధిస్తున్న పురోగతికి నౌకాదళ ఆధునీకరణ ఒక ప్రతీకగా నిలుస్తోంది.

ప్రాజెక్ట్-17ఏ కింద నిర్మించిన ఐఎన్‌ఎస్ దూనగిరి అత్యాధునిక స్టెల్త్ ఫ్రిగేట్‌గా రూపుదిద్దుకుంది. బ్రహ్మోస్ క్షిపణులు, ఆధునిక గగనతల రక్షణ వ్యవస్థలు, అత్యాధునిక సెన్సార్లతో ఇది సముద్ర యుద్ధ సామర్థ్యాలను మరింత బలోపేతం చేయనుంది. ఐఎన్‌ఎస్ సంశోధక్ తీరప్రాంతాలు, లోతైన సముద్ర ప్రాంతాల్లో హైడ్రోగ్రాఫిక్ సర్వేలు నిర్వహిస్తూ రక్షణ, వాణిజ్య, శాస్త్రీయ అవసరాలకు ఉపయోగపడే కీలక సమాచారాన్ని సేకరించనుంది. ఐఎన్‌ఎస్ అగ్రయ్ జలాంతర్గామి వ్యతిరేక యుద్ధ నౌకగా తీరప్రాంతాలు, నిస్సార జలాల్లో శత్రు జలాంతర్గాముల కదలికలను గుర్తించి సమర్థవంతంగా ఎదుర్కొనే సామర్థ్యాన్ని కలిగి ఉంది.

గత కొన్నేళ్లలో 40కి పైగా స్వదేశీ యుద్ధనౌకలు, జలాంతర్గాములు భారత నౌకాదళంలో చేరగా, ప్రస్తుతం 45 ప్రధాన నౌకాదళ వేదికలు దేశీయ షిప్‌యార్డుల్లో నిర్మాణంలో ఉన్నాయి. ఇది కేవలం రక్షణ రంగంలో పురోగతి మాత్రమే కాదు; భారత పారిశ్రామిక సామర్థ్యం, ఇంజినీరింగ్ నైపుణ్యం, స్వదేశీ సాంకేతిక అభివృద్ధికి నిదర్శనం. ఐఎన్‌ఎస్ విక్రాంత్‌తో ప్రారంభమైన సముద్ర స్వావలంబన ప్రయాణం ఇప్పుడు మరింత విస్తృత రూపాన్ని సంతరించుకుంటోంది.

భారత నౌకాదళం పాత్ర యుద్ధ భద్రతకే పరిమితం కాదు. వరదలు, తుఫానులు, సునామీలు, భూకంపాలు వంటి ప్రకృతి వైపరీత్యాల సమయంలో సహాయక చర్యలు, పునరావాస కార్యక్రమాల్లోనూ నౌకాదళం ముందుంటుంది. దేశ ప్రజల భద్రత, మానవతా సేవలు, సముద్ర రక్షణ — ఈ మూడు రంగాల్లోనూ విశిష్ట సేవలు అందిస్తూ ప్రజల విశ్వాసాన్ని చూరగొంటోంది. ఆధునిక నౌకలు, అత్యాధునిక ఆయుధాలు, సాంకేతిక సామర్థ్యాలతో పాటు నిబద్ధత కలిగిన మానవ వనరులే నౌకాదళానికి అసలైన బలం. ప్రపంచ స్థాయి సముద్ర శక్తిగా ఎదగాలనే లక్ష్యంతో ముందుకు సాగుతున్న భారతదేశానికి స్వదేశీ సామర్థ్యాలు, యువశక్తి, సాంకేతిక నైపుణ్యం కలిసి బలమైన పునాదిని నిర్మిస్తున్నాయి.

పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో నిర్మించిన యుద్ధ నౌక ‘దూనగిరి’, భారీ సర్వే నౌక ‘సంశోధక్’, జలాంతర్గామి విధ్వంసక నౌక ‘అగ్రయ్’. ఈ మూడు నౌకలు యుద్ధ, సర్వే, జలాంతర్గామి నిరోధక కార్యకలాపాల్లో నౌకాదళ సామర్థ్యాన్ని గణనీయంగా పెంచనున్నాయి. ఐఎన్‌ఎస్ దూనగిరి, సంశోధక్, అగ్రయ్ చేరిక భారత నౌకాదళానికి కొత్త బలాన్ని అందించడమే కాకుండా, ‘ఆత్మనిర్భర్ భారత్’ నుంచి ‘వికసిత్ భారత్’ దిశగా సాగుతున్న దేశ ప్రయాణానికి కూడా శక్తివంతమైన ప్రతీకగా నిలుస్తోంది. సముద్రంలో తన సామర్థ్యాన్ని విస్తరించుకుంటూ, ప్రపంచ వేదికపై మరింత ప్రభావవంతమైన దేశంగా భారత్ ఎదుగుతున్న దృశ్యానికి ఈ మూడు నౌకలు కొత్త అధ్యాయాన్ని జోడించాయి.

— వాడవల్లి శ్రీధర్ ॥