ప్రైవేట్ కాంట్రాక్టర్ ఆధీనంలో మున్సిపాలిటీ వాటర్ ట్యాంకర్
మోత్కూర్, ఆంధ్రప్రభ: మోత్కూర్ మున్సిపాలిటీ అధికారులు ప్రభుత్వ ఆస్తుల వినియోగంలో ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. మున్సిపాలిటీకి చెందిన వాటర్ ట్యాంకర్‌ను ప్రైవేట్ కాంట్రాక్టర్ పనుల కోసం వినియోగిస్తున్న ఘటన స్థానికంగా చర్చనీయాంశమైంది.పట్టణంలోని కస్తూర్బా పాఠశాల సమీపంలో ప్రభుత్వ భూమికి కంచె, ప్రవేశ ద్వారాల ఏర్పాటు పనులు ప్రస్తుతం కొనసాగుతున్నాయి. ఈ పనులను మున్సిపాలిటీ అధికారులు ఓ ప్రైవేట్ కాంట్రాక్టర్‌కు అప్పగించారు. అయితే, పనుల నిర్వహణకు అవసరమైన నీటిని కాంట్రాక్టర్ స్వయంగా సమకూర్చుకోవాల్సి ఉండగా, మున్సిపాలిటీకి చెందిన వాటర్ ట్యాంకర్‌ను వినియోగిస్తున్నట్లు స్థానికులు ఆరోపిస్తున్నారు.
సాధారణంగా పట్టణంలో తాగునీటి సరఫరా కోసం వినియోగించాల్సిన ప్రభుత్వ వాహనాలను ప్రైవేట్ కాంట్రాక్టర్లు ఉపయోగించడం ఎంతవరకు సమంజసమని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. ఈ ట్యాంకర్ వినియోగం వెనుక ఎవరి ఆదేశాలు ఉన్నాయనే అంశంపై కూడా అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.మున్సిపాలిటీ అధికారులు ప్రజా ప్రయోజనాల కంటే కాంట్రాక్టర్ల సౌకర్యాలకే ప్రాధాన్యం ఇస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. ప్రజల పన్నుల సొమ్ముతో కొనుగోలు చేసిన వాహనాలు ప్రజల అవసరాలకే పరిమితం కావాలని పట్టణవాసులు డిమాండ్ చేస్తున్నారు. ఈ వ్యవహారంపై వివరణ కోసం మున్సిపల్ కమిషనర్ జి. నరసయ్యను సంప్రదించగా, వివరాలు తెలుసుకొని సంబంధిత కాంట్రాక్టర్‌పై తగిన చర్యలు తీసుకుంటామని తెలిపారు.

