ఎస్సీ, ఎస్టీలపై దాడులను ఉపేక్షించం: ఎంపీ డాక్టర్ మల్లు రవి

  • బాధితులకు సత్వర న్యాయం, నష్టపరిహారం అందించాలి..
  • జిల్లా విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ సమావేశంలో అధికారులకు ఆదేశాలు

నాగర్‌కర్నూల్, ఆంధ్రప్రభ: ఎస్సీ, ఎస్టీల సంక్షేమం, భద్రత, సామాజిక న్యాయానికి రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని, వారి హక్కుల పరిరక్షణలో అధికారులు బాధ్యతాయుతంగా వ్యవహరించాలని నాగర్‌కర్నూల్ పార్లమెంట్ సభ్యుడు డాక్టర్ మల్లు రవి సూచించారు. ఎస్సీ, ఎస్టీలపై జరిగే దాడులు, హత్యలు, అత్యాచారాలు, సామాజిక వివక్ష ఘటనలను ఏమాత్రం ఉపేక్షించబోమని ఆయన స్పష్టం చేశారు.

గురువారం జిల్లా కలెక్టరేట్‌లో జిల్లా కలెక్టర్ హేమంత్ కేశవ్ పాటీల్ అధ్యక్షతన నిర్వహించిన జిల్లా విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ సమావేశంలో ఎంపీ ముఖ్య అతిథిగా పాల్గొని జిల్లాలో నమోదైన ఎస్సీ, ఎస్టీ అత్యాచారాల కేసులు, బాధితులకు అందిస్తున్న నష్టపరిహారం, పునరావాస చర్యలు, సంక్షేమ పథకాల అమలుపై సమీక్ష నిర్వహించారు.

ప్రతి కేసును అత్యంత ప్రాధాన్యతతో విచారించి బాధితులకు సత్వర న్యాయం అందించాలని, ప్రభుత్వం ప్రకటించిన నష్టపరిహారం, పునరావాసం, ఇతర సంక్షేమ ప్రయోజనాలు ఆలస్యం లేకుండా చేరేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.

జిల్లాలోని నాగర్‌కర్నూల్, కల్వకుర్తి, కొల్లాపూర్, అచ్చంపేట పోలీసు సబ్‌డివిజన్ల పరిధిలో నమోదైన కేసులపై సమావేశంలో క్షుణ్ణంగా సమీక్షించారు. ఎఫ్‌ఐఆర్ నమోదు, దర్యాప్తు పురోగతి, చార్జిషీట్లు, నిందితుల అరెస్టులు, కోర్టు విచారణ, నష్టపరిహారం చెల్లింపులపై సంబంధిత డీఎస్పీల నుంచి వివరాలు తెలుసుకున్నారు.

పెండింగ్‌లో ఉన్న కేసులను ప్రత్యేకంగా పర్యవేక్షించి, విచారణలో జాప్యానికి కారణాలను వెంటనే తొలగించాలని ఎంపీ డాక్టర్ మల్లు రవి అధికారులకు సూచించారు. విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ పనితీరుకు సంబంధించి ఏవైనా సమస్యలు ఉంటే తన దృష్టికి తీసుకురావాలని సభ్యులను కోరారు.

జిల్లా కలెక్టర్ హేమంత్ కేశవ్ పాటీల్ మాట్లాడుతూ జిల్లాలో ఎస్సీ, ఎస్టీల సంక్షేమం, భద్రత కోసం జిల్లా యంత్రాంగం సమన్వయంతో పనిచేస్తోందన్నారు. జిల్లా ఎస్పీ డాక్టర్ సంగ్రామ్ సింగ్ జీ పాటిల్ మాట్లాడుతూ బాధితులకు త్వరితగతిన న్యాయం అందించేందుకు కేసు నమోదు నుంచి దర్యాప్తు, చార్జిషీట్ దాఖలు, నిందితుల అరెస్టు వరకు ప్రతి దశను నిరంతరం పర్యవేక్షిస్తున్నామని తెలిపారు.

సమావేశంలో ఎమ్మెల్యేలు డాక్టర్ కూచుకుళ్ల రాజేష్ రెడ్డి, కసిరెడ్డి నారాయణరెడ్డి, జిల్లా విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ సభ్యులు ఎల్లపోగు వెంకటస్వామి, చిన్నగళ్ల రమేష్, గమ్మకొండ రాములు, వెల్టూరు రేనయ్య, కే. చంద్రర్, బండ పర్వతాలు, మహమ్మద్ అబ్దుల్ ఖదీర్ తదితరులు పాల్గొన్నారు.