గిరిపురంలో ఉపాధి హామీ పనులకు శ్రీకారం
గిరిపురంలో ఉపాధి హామీ పనులకు శ్రీకారం
- సర్పంచ్ బాదావత్ నీల సైదులు
మరిపెడ, ఆంధ్రప్రభ: మహబూబాబాద్ జిల్లా మరిపెడ మండలంలోని గిరిపురం గ్రామ పంచాయతీ పరిధిలో గల పూసల తండాలో సోమవారం మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం పనులను ఘనంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి గిరిపురం గ్రామ సర్పంచ్ బాదావత్ నీల సైదులు ముఖ్య అతిథిగా హాజరై, పూజా కార్యక్రమాలు నిర్వహించి ఉపాధి పనులను అధికారికంగా ప్రారంభించారు.
ఈ సందర్భంగా సర్పంచ్ నీల సైదులు మాట్లాడుతూ.. గ్రామీణ ప్రాంతాల్లోని పేద కుటుంబాలకు ఆర్థికంగా అండగా నిలిచేందుకు ఉపాధి హామీ పథకం ఎంతో దోహదపడుతుందని కొనియాడారు. ప్రభుత్వం కల్పిస్తున్న ఈ వంద రోజుల కూలి పని అవకాశాన్ని గ్రామ ప్రజలు, కూలీలు పూర్తి స్థాయిలో సద్వినియోగం చేసుకోవాలని ఆయన సూచించారు. కూలీలకు గ్రామాల్లోనే నిరంతర ఉపాధి కల్పించడం ద్వారా వారి జీవనోపాధి మెరుగుపడుతుందని, వలసలను అరికట్టవచ్చని ఆయన అభిప్రాయపడ్డారు. పనులు చేసే చోట కూలీలకు అవసరమైన కనీస వసతులు కల్పించాలని అధికారులకు సూచించారు.
ఈ కార్యక్రమంలో స్థానిక ఆరో వార్డు, ఏడో వార్డుల వార్డు సభ్యులు (వార్డ్ మెంబర్లు), ఉపాధి హామీ పథకం ఫీల్డ్ అసిస్టెంట్లు, మేట్లు, పూసల తండా వాసులు మరియు పెద్ద సంఖ్యలో ఉపాధి కూలీలు పాల్గొన్నారు.
