Minister | పెట్రోల్, డీజిల్ ధరలు వెంటనే తగ్గవు
Minister | పెట్రోల్, డీజిల్ ధరలు వెంటనే తగ్గవు
సరఫరా పరిస్థితుల సమీక్ష తర్వాతే ధరలపై నిర్ణయం
Minister | ఆంధ్రప్రభ, వెబ్డెస్క్: అమెరికా–ఇరాన్ మధ్య శాంతి ఒప్పందం కుదరడంతో అంతర్జాతీయ మార్కెట్లో ముడిచమురు ధరలు తగ్గుముఖం పట్టాయి. దీంతో దేశంలో పెట్రోల్, డీజిల్, వంటగ్యాస్ ధరలు తగ్గుతాయన్న ఆశలు వినియోగదారుల్లో నెలకొన్నాయి. అయితే ఇంధన ధరల తగ్గింపుపై కేంద్ర ప్రభుత్వం కీలక వ్యాఖ్యలు చేసింది.
కేంద్ర పెట్రోలియం, సహజవాయు శాఖ సహాయ మంత్రి సురేష్ గోపి మాట్లాడుతూ.. అంతర్జాతీయ మార్కెట్లో ముడిచమురు ధరలు తగ్గినంత మాత్రాన దేశంలో ఇంధన ధరలను వెంటనే తగ్గించడం సాధ్యం కాదని స్పష్టం చేశారు.
ముడిచమురు కొనుగోలు, రవాణా, నిల్వ, శుద్ధి ప్రక్రియలకు సమయం పడుతుందని పేర్కొన్నారు. ప్రస్తుతం దేశంలో ముడిచమురు లభ్యత, సరఫరా పరిస్థితులను కేంద్ర పెట్రోలియం శాఖ నిరంతరం సమీక్షిస్తోందని తెలిపారు. పరిస్థితులను పూర్తిగా అంచనా వేసిన తర్వాతే ధరలపై నిర్ణయం తీసుకుంటామని వెల్లడించారు.
ఇంధన ధరల నిర్ణయం కేవలం అంతర్జాతీయ ముడిచమురు ధరల ఆధారంగా ఉండదని మంత్రి వివరించారు. విదేశీ మారక విలువ, కేంద్ర-రాష్ట్ర పన్నులు, రవాణా వ్యయాలు, ఇతర నిర్వహణ ఖర్చులు కూడా ధరల నిర్ణయంలో కీలక పాత్ర పోషిస్తాయని చెప్పారు. ముడిచమురు ధరలు తగ్గుతున్న నేపథ్యంలో ఇంధన ధరలపై కేంద్రం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందోనని దేశవ్యాప్తంగా ప్రజలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
