Rs.5Lakh | పట్టణ వాసులకు అలర్ట్..

Rs.5Lakh | పట్టణ వాసులకు అలర్ట్..
Rs.5Lakh | రోడ్‌సైడ్ ఆహారంపై ప్రజల ఆధారపడటం
జియాగూడలో సమోసా యూనిట్‌పై దాడి
పాడైన పదార్థాలతో తయారీ వెలుగులోకి
లైసెన్స్ లేకుండా నిర్వహణపై చర్యలు
సమోసాల నాణ్యతపై పెరుగుతున్న అనుమానాలు
ఆరోగ్యానికి ముప్పుగా మారుతున్న స్ట్రీట్ ఫుడ్
అధికారుల చర్యలపై ప్రజల్లో అసంతృప్తి
Rs.5Lakh | ఆంధ్రప్రభ, వెడ్‌డెస్క్: పట్టణ ప్రాంతాల్లో ఆకలి వేసినప్పుడు తక్కువ ధరలో లభించే ఆహారానికి ప్రజలు మొగ్గు చూపడం సహజం. వేగంగా మారుతున్న జీవనశైలి, పనుల ఒత్తిడి కారణంగా చాలా మంది రోడ్‌సైడ్ ఫుడ్‌పై ఆధారపడుతున్నారు. కానీ ఈ ఆహారం నాణ్యతగలదా? లేక హానికరమా? అనే సందేహం అందరిలోనూ కలిగిస్తుంది. ఇటీవల హైదరాబాద్‌లో జరిగిన పరిణామాలు ఈ అనుమానాలకు బలాన్ని ఇచ్చాయి. హైదరాబాద్‌లో భారీగా నిల్వ చేసిన పాడైపోయిన చికెన్‌ను అధికారులు స్వాధీనం చేసుకోవడం సంచలనం రేపింది.

నేడు జియాగూడలోని సమోసా తయారీ యూనిట్‌పై టాస్క్‌ఫోర్స్ అధికారులు దాడి చేశారు. హెచ్-ఫాస్ట్, కుల్సుంపురా పోలీసులు సంయుక్త ఆపరేషన్ నిర్వహించారు. రూ. 5 లక్షల విలువైన అనారోగ్యకర ఆహార పదార్థాలను స్వాధీనం చేసుకున్నారు. పాడైన గుడ్లు, వాడిన నూనెతో సమోసాలు తయారు చేస్తున్నట్లు గుర్తించారు. అలాగే, యూనిట్ ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ లైసెన్స్, ట్రేడ్ లైసెన్స్ లేకుండా నిర్వహించబడుతున్నట్టు కూడా తెలిసింది.
వందల సంఖ్యలో సమోసాలు, ముడి పదార్థాలు, యంత్రాలు స్వాధీనం చేసుకున్నారు. యూనిట్ నిర్వాహకుడు అబ్దుల్ రషీద్‌ను పోలీసులు అరెస్టు చేశారు. ఇలాంటి ఘటనలు వెలుగులోకి వస్తుండటం పెద్ద స్థాయిలో జరుగుతుందనే అనుమానాన్ని పెంచుతుంది. రోడ్ పక్కన ఉన్న చిన్న ఫుడ్ సెంటర్ల పరిస్థితి ఎలా ఉందో అనే ప్రశ్న సామాన్య ప్రజల్లో తీవ్రంగా చర్చకు దారి తీస్తోంది.
Rs.5Lakh | సమోసాలపై పెరుగుతున్న అనుమానాలు

సమోసాలను పెద్ద మొత్తంలో తయారు చేసి, ఎటువంటి శుభ్రత ప్రమాణాలు పాటించకుండా రోడ్లపై తరలించడం, గంటల తరబడి బయట ఉంచడం వల్ల అవి ఆరోగ్యానికి ముప్పుగా మారుతున్నాయి. ముఖ్యంగా రోడ్లపై నిల్వ చేసిన పదార్థాలు పాడైపోయే ప్రమాదం ఎక్కువ. చాలా చోట్ల ఆహారం తయారు చేసే కేంద్రాల్లో శుభ్రత ప్రమాణాలు పూర్తిగా పాటించబడడం లేదు.
మురికి వాతావరణం, పాత నూనెల వినియోగం, నిల్వ విధానాల్లో లోపాలు కలిపి ప్రజల ఆరోగ్యాన్ని ప్రమాదంలో పెడుతున్నాయి. కొన్ని సందర్భాల్లో సామోసాలు తినేటప్పుడే పురుగులు, బల్లులు కనిపించిన ఘటనలు కూడా వెలుగులోకి వచ్చాయి. ఇలాంటి ఆహారం తినడం వల్ల ఫుడ్ పాయిజన్, వైరల్ ఇన్ఫెక్షన్లు వంటి సమస్యలు పెరుగుతున్నాయి. గతంలో మోమోస్ తినడం వల్ల కొంతమంది మరణించిన ఘటన రాష్ట్రవ్యాప్తంగా కలకలం రేపింది. ఆ తర్వాత ప్రభుత్వం కొన్ని ప్రాంతాల్లో మోమోస్‌పై నిషేధం విధించింది.
Rs.5Lakh | అధికారుల చర్యలు సరిపోతున్నాయా?

ఆహార భద్రత కోసం బాధ్యత వహించాల్సిన అధికారులు అప్పుడప్పుడు దాడులు నిర్వహిస్తున్నప్పటికీ, అవి తాత్కాలిక చర్యలుగానే మిగిలిపోతున్నాయని విమర్శలు వినిపిస్తున్నాయి. పెద్ద ఘటనలు జరిగిన తర్వాతే చర్యలు తీసుకుంటున్నారని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రాణాలు పోయిన తర్వాత స్పందించడం కాదు, ముందుగానే నివారణ చర్యలు తీసుకోవాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.
