రెండేళ్లలో నమ్మకాన్ని నిలబెట్టాం!
- రాబోయే మూడేళ్లు స్వర్ణాంధ్ర నిర్మాణానికి అంకితం!
- ఎంపీ కేసినేని చిన్ని
ఇబ్రహీంపట్నం, ఆంధ్రప్రభ : రెండేళ్ల క్రితం ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఇచ్చిన తీర్పు ఒక పార్టీకి కాదనీ ఒక భవిష్యత్తుకనీ,ఆ తీర్పు ఒక నాయకుడికి కాదనీ ఒక రాష్ట్ర పునర్నిర్మాణానికని, ఆ నమ్మకాన్ని నిలబెట్టడమే కూటమి ప్రభుత్వ ధ్యేయం” అని విజయవాడ పార్లమెంట్ సభ్యులు కేశినేని శివనాథ్ (చిన్ని) పేర్కొన్నారు. మైలవరం నియోజకవర్గంలోని గుంటుపల్లి సీ కన్వెన్షన్‌లో నిర్వహించిన కూటమి ప్రభుత్వం రెండేళ్ల విజయోత్సవ సభలో మాట్లాడిన ఆయన, రాష్ట్ర అభివృద్ధి, ప్రజా సంక్షేమం, భవిష్యత్ తరాల అవకాశాలపై తన విజన్‌ను వివరించారు.
“రెండేళ్ల క్రితం రాష్ట్ర ప్రజలు తమపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకోవడమే కూటమి ప్రభుత్వ లక్ష్యం అని తెలిపారు. ఈ రెండేళ్లలో అభివృద్ధి ఆగలేదనీ సంక్షేమం తగ్గలేదనీ,,ప్రజల జీవితాల్లో మార్పు తీసుకురావడమే కూటమి ప్రభుత్వ ధ్యేయంగా పనిచేశామని ఆయన పేర్కొన్నారు. ప్రతి పథకం వెనుక ఒక కుటుంబం ఆనందం ఉందనీ,ప్రతి అభివృద్ధి కార్యక్రమం వెనుక రాష్ట్ర భవిష్యత్తు ఉందనీ, ప్రజల ఆశలు, ఆకాంక్షలే తమ పాలనకు దిక్సూచి అని ప్రజల ఆశీర్వాదాలతో ఆంధ్రప్రదేశ్‌ను మరింత అభివృద్ధి పథంలో నడిపిస్తామన్నారు. ప్రజల విశ్వాసమే తమ బలమనీ,ప్రజా సేవే తమ లక్ష్యం” అని ఎంపీ చిన్ని భావోద్వేగంగా అన్నారు.
“రాష్ట్రం ముందుకు వెళ్లాలంటే కేవలం ప్రభుత్వాలు మారడం సరిపోదనీ ఆలోచనలు మారాలన్నారు. విమర్శలతో కాదు,విజన్‌తో అభివృద్ధి సాధ్యమవుతుందన్నారు. గతాన్ని తలచుకుని బాధపడటం కాదనీ, భవిష్యత్తును నిర్మించుకోవడం ముఖ్యం” అంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు సభలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. రెండేళ్ల కాలంలో కూటమి ప్రభుత్వం సంక్షేమం, అభివృద్ధి రెండింటినీ సమన్వయంతో ముందుకు తీసుకెళ్లిందని పేర్కొన్న ఆయన, తల్లికి వందనం, అన్నదాత సుఖీభవ, స్త్రీ శక్తి, దీపం-2.0, ఎన్టీఆర్ భరోసా వంటి పథకాల ద్వారా ప్రతి ఇంటికి ప్రభుత్వం చేరువైందన్నారు.
అయితే తమ లక్ష్యం కేవలం సంక్షేమం మాత్రమే కాదని, “ఒక కుటుంబానికి ఆర్థిక భరోసా ఇవ్వడం ఎంత ముఖ్యమో,,.. ఆ కుటుంబంలోని యువకుడికి ఉద్యోగ అవకాశం కల్పించడం అంతకంటే ముఖ్యమని” ఆయన స్పష్టం చేశారు. అమరావతి నిర్మాణం, విశాఖ ఐటీ అభివృద్ధి, పరిశ్రమల విస్తరణ, ప్రపంచ స్థాయి పెట్టుబడుల ఆకర్షణపై ప్రస్తావిస్తూ, “గతంలో ఉద్యోగాల కోసం మన పిల్లలు రాష్ట్రం దాటి వెళ్లేవారు,ఇప్పుడు ఉద్యోగాలే ఆంధ్రప్రదేశ్ వైపు వస్తున్నాయని,ఇదే నిజమైన మార్పు” అని అన్నారు.
సింగపూర్‌లో జరిగిన సెమీకాన్ సదస్సులో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రపంచానికి ఆంధ్రప్రదేశ్ సామర్థ్యాన్ని చాటిచెప్పారని, నినాదం నేడు ప్రపంచ పెట్టుబడిదారులను రాష్ట్రం వైపు ఆకర్షిస్తోందని పేర్కొన్నారు..విజయవాడ పార్లమెంట్ అభివృద్ధిపై మాట్లాడుతూ, ప్రజలు తనపై ఉంచిన విశ్వాసాన్ని బాధ్యతగా తీసుకుని పనిచేస్తున్నానని తెలిపారు.
“ఎంపీగా నాకు పదవి కాదు, బాధ్యత కనిపిస్తుంది., ప్రజలు ఇచ్చిన ఆశీర్వాదం కాదు., అప్పగించిన కర్తవ్యం కనిపిస్తుందనీ, విజయవాడ అభివృద్ధి నా రాజకీయ లక్ష్యం కాదు, నా ప్రజా బాధ్యత” అని చిన్ని వ్యాఖ్యానించగా సభలో కరతాళ ధ్వనులు మార్మోగాయి. రహదారులు, మౌలిక వసతులు, పారిశ్రామిక అవకాశాలు, విద్య, వైద్యం వంటి అన్ని రంగాల్లో విజయవాడ పార్లమెంట్‌ను ఆదర్శంగా తీర్చిదిద్దేందుకు నిరంతరం కృషి చేస్తున్నామని తెలిపారు.
ప్రతిపక్షాల విమర్శలను పరోక్షంగా ప్రస్తావిస్తూ, “మాటలతో వార్తల్లో నిలవడం సులభం,పనులతో ప్రజల మనసుల్లో నిలవడం కష్టం!, మేము రెండో మార్గాన్ని ఎంచుకున్నామని,అబద్ధపు ప్రచారాలు కొన్ని రోజులు నడుస్తాయి.,కానీ అభివృద్ధి శాశ్వతంగా మాట్లాడుతుంది” అని అన్నారు.
సభ ముగింపులో ఆయన చేసిన పిలుపు అందరినీ ఆలోచింపజేసింది.
“ఈ రెండేళ్లు నమ్మకానికి నిదర్శనం,రాబోయే మూడేళ్లు చరిత్ర సృష్టించే కాలం!,మన పిల్లలు ఉద్యోగాల కోసం రాష్ట్రం విడిచి వెళ్లని ఆంధ్రప్రదేశ్,రైతు గర్వంగా జీవించే ఆంధ్రప్రదేశ్,, మహిళ స్వావలంబనతో ముందుకు సాగే ఆంధ్రప్రదేశ్,, ప్రపంచం గర్వంగా చూసే ఆంధ్రప్రదేశ్‌ను కలిసి నిర్మిద్దామని పిలుపునిచ్చారు. ప్రజల విశ్వాసమే మా బలం,ప్రజా సేవే మా లక్ష్యం” అని పిలుపునిచ్చారు.
“రెండేళ్లలో నమ్మకం… ఐదేళ్లలో స్వర్ణాంధ్ర!”
అంటూ ఎంపీ కేశినేని శివనాథ్ (చిన్ని) ప్రసంగాన్ని ముగించగా సభా ప్రాంగణం కరతాళ ధ్వనులతో మార్మోగింది. ఆయన మాటల్లో ప్రతిఫలించిన నిబద్ధత, ప్రజల పట్ల ఉన్న బాధ్యతాభావం, ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తుపై వ్యక్తం చేసిన విశ్వాసం సభకు హాజరైన వారిని విశేషంగా ఆకట్టుకున్నాయి. ఈ రెండు సంవత్సరాల విజయోత్సవ సభలో ఎన్ టీ ఆర్ జిల్లా ఇన్ ఛార్జ్ మంత్రి సత్యకుమార్ యాదవ్, ప్రభుత్వ విప్ నందిగామ ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య, టీడీపీ జిల్లా అధ్యక్షురాలు గద్దె అనురాధ, మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్, టిడిపి జాతీయ ఉపాధ్యక్షులు బుద్ధ వెంకన్న, పోలీస్ బ్యూరో సభ్యులు వర్ల రామయ్య, విజయవాడ తూర్పు ఎమ్ ఎల్ ఏ గద్దె రామ మోహన్ రావు, జగ్గయ్యపేట ఎమ్ ఎల్ ఏ శ్రీ రామ్ తాతయ్య, తిరువూరు ఎమ్ ఎల్ ఏ కొలికపూడి శ్రీనివాసరావు, కె డి సి సి బ్యాంకు చైర్మన్ నెట్టం రఘురామ్, గ్రంథాలయ పరిషత్ చైర్మన్ ఎమ్ ఎస్ బేగ్,రాష్ట్ర నూర్ భాషా కార్పొరేషన్ ఛైర్మన్ నాగుల్ మీరా,వైశ్య కార్పొరేషన్ చైర్మన్ డూండీ రాజేష్,బిల్డింగు కార్పొరేషన్ చైర్మన్ గొట్టు ముక్కల రఘు రామ రాజు తదితర నేతలు, వందలాది మంది కార్యకర్తలు విశేష సంఖ్యలో పాల్గొన్నారు.
