నిరూపిస్తే ఐదు నిమిషాల్లో రాజీనామా..

తప్పు చేస్తే ఎమ్మెల్యే పదవికి రాజీనామా’
కాంట్రాక్టులు అడిగానని రుజువు చేస్తే రాజకీయాల నుంచి తప్పుకుంటా..
విజయ డైరీ అక్రమాలపై స్పీకర్‌కు ఆధారాలు సమర్పించా..
పార్టీ కోసం పని చేసిన కార్యకర్తలే నష్టపోయారు..
‘ప్రభుత్వంపై అసంతృప్తి ఉంటే విప్‌గా ఎందుకు కొనసాగుతా..
ప్రభుత్వంపై తిరుగుబాటు ప్రసక్తే లేదు..
వల్లభనేని వంశీ అనుచరులకు కాంట్రాక్టులు…
గన్నవరం ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు..

ఎన్టీఆర్ బ్యూరో, ఆంధ్రప్రభ : కొన్ని పత్రికలు, మీడియా ఛానళ్లలో తనపై వస్తున్న కథనాలను తీవ్రంగా ఖండిస్తూ గన్నవరం ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డికి బహిరంగ సవాల్ విసిరారు. విజయవాడలోని తన నివాసంలో సోమవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, తాను కాంట్రాక్టులు అడిగానని ప్రచారం చేస్తున్నారని, ఆ మాట తాను అన్నట్లు నిరూపిస్తే ఐదు నిమిషాల్లో ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానని స్పష్టం చేశారు. గతంలో తనను తీవ్రంగా విమర్శించిన వారినే జగన్ తన పార్టీలో చేర్చుకున్నారని విమర్శించిన యార్లగడ్డ, తాను మాత్రం ఎవరి కోసం తన వ్యక్తిత్వాన్ని, క్యారెక్టర్‌ను వదులుకోనని అన్నారు.

వైఎస్సార్‌సీపీకి బహిరంగ సవాల్ విసురుతున్నానని, తనపై అసత్య ప్రచారాలు, పిచ్చి రాతలు వెంటనే మానుకోవాలని హెచ్చరించారు. చంద్రబాబు నాయుడు అక్రమ అరెస్టు జరిగిన సమయంలో ఇప్పుడు విమర్శలు చేస్తున్న వారు ఎక్కడ ఉన్నారని ప్రశ్నించారు. ‘బాబు ఎంటర్‌ప్రైజెస్’ సంస్థ వల్లభనేని వంశీ అనుచరుడు కడియాల సతీష్‌కు సంబంధించినదేనని పేర్కొన్న ఆయన, ఎన్నికలకు ముందు వల్లభనేని వంశీతో ఎవరు టచ్‌లో ఉన్నారో ప్రజలకు తెలుసని అన్నారు. ప్రభుత్వం పట్ల అసంతృప్తి ఉంటే తాను విప్‌గా ఎందుకు కొనసాగుతానని ప్రశ్నించారు.

తన ప్రత్యర్థికి సంబంధించిన వ్యక్తులకు కాంట్రాక్టులు ఎలా కేటాయిస్తున్నారో ప్రభుత్వం సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. విజయ డైరీలో జరిగిన అవినీతిపై ఇప్పటికే అసెంబ్లీలో స్పీకర్‌కు ఆధారాలు సమర్పించానని, విజయ డైరీని ఎవరు తెరిచారో తనకు సమాచారం లేదన్నారు. స్థానిక ఎమ్మెల్యేగా తనకు కనీస సమాచారం కూడా ఇవ్వలేదని ఆవేదన వ్యక్తం చేశారు. విజయ డైరీ అంశం తెలుగుదేశం పార్టీ కార్యకర్తల ఆత్మఘోషగా మారిందని, పార్టీ కోసం పనిచేసిన 52 మంది కార్యకర్తలు ఊరు విడిచి వెళ్లిపోయే పరిస్థితి వచ్చిందని చెప్పారు. ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో తాను జగన్‌ను ఎప్పుడూ పదవులు అడగలేదని పేర్కొన్న యార్లగడ్డ, ప్రస్తుత అంశాలపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేష్‌తో మాట్లాడతానని తెలిపారు. తాను చేసిన ప్రతి వ్యాఖ్యకు కట్టుబడి ఉంటానని, యార్లగడ్డ తిరుగుబాటు అనే ప్రసక్తే లేదని, ఏది చేసినా బహిరంగంగానే చేస్తానని స్పష్టం చేశారు.