ఆటో డ్రైవర్లకు ట్రాఫిక్ నిబంధనలపై అవగాహన
టాక్టికల్ అర్బనిజంలో భాగంగా ప్రత్యేక తనిఖీలు ..
రాంగ్ పార్కింగ్ వాహనాలకు జరిమానాలు…
విజయవాడ క్రైమ్, ఆంధ్రప్రభ : నగరంలో ట్రాఫిక్ క్రమబద్ధీకరణ, రోడ్డు భద్రత లక్ష్యంగా టాక్టికల్ అర్బనిజం కార్యక్రమంలో భాగంగా ఎన్‌టీఆర్ జిల్లా పోలీసులు మంగళవారం ఆటో డ్రైవర్లకు ప్రత్యేక అవగాహన కార్యక్రమం నిర్వహించారు. నగర పోలీస్ కమిషనర్ ఎస్.వి. రాజశేఖర బాబు ఆదేశాలు, ట్రాఫిక్ డీసీపీ షీరిన్ బేగం సూచనల మేరకు వన్ ట్రాఫిక్ ఏసీపీ రామచంద్రరావు పర్యవేక్షణలో వన్ ట్రాఫిక్ ఇన్‌స్పెక్టర్ ఎ. ఉమామహేశ్వరరావు ఆధ్వర్యంలో బ్రాహ్మణ వీధి, గద్ద బొమ్మ సెంటర్, కాలేశ్వరం మార్కెట్ ప్రాంతాల్లో ప్రత్యేక తనిఖీలు చేపట్టారు.ఈ సందర్భంగా ఆటోల పత్రాలను పరిశీలించిన పోలీసులు డ్రైవర్లకు ట్రాఫిక్ నిబంధనలపై అవగాహన కల్పించారు.
విధిగా యూనిఫామ్ ధరించడం, సరైన పత్రాలు కలిగి ఉండడం, మహిళలు, చిన్నారులు, వృద్ధుల పట్ల మర్యాదగా వ్యవహరించడం, ఆటోల్లో పరిమితికి మించి ప్రయాణికులను ఎక్కించకపోవడం, రాంగ్ రూట్‌లో ప్రయాణించకపోవడం వంటి అంశాలపై సూచనలు చేశారు. ప్రమాదాలు జరిగినప్పుడు బాధితులను వెంటనే ఆస్పత్రికి తరలించే బాధ్యత తీసుకోవాలని, ప్రయాణికులు మరిచిపోయిన విలువైన వస్తువులను సమీప ట్రాఫిక్ పోలీసులకు అప్పగించాలని సూచిస్తూ డ్రైవర్లతో ప్రతిజ్ఞ చేయించారు.రాంగ్ పార్కింగ్‌లో ఉన్న ఆటోలను గుర్తించి కౌన్సిలింగ్ నిర్వహించడంతో పాటు నిబంధనలు ఉల్లంఘించిన వాహనాలకు జరిమానాలు విధించారు. రద్దీ ప్రాంతాల్లో ట్రాఫిక్‌కు, పాదచారులకు అంతరాయం కలగకుండా నిర్ణీత ప్రదేశాల్లోనే ప్రయాణికులను ఎక్కించుకోవాలని పోలీసులు సూచించారు.ఈ కార్యక్రమంలో ఆర్‌ఎస్‌ఐ శ్రీధర్‌తో , ట్రాఫిక్ సిబ్బంది పాల్గొన్నారు.
