2 లక్షల ఎకరాల్లో పీఎండీఎస్ లక్ష్యం..
2 లక్షల ఎకరాల్లో పీఎండీఎస్ లక్ష్యం..
సహజ వ్యవసాయంలో అనంతపురం ఆదర్శం కావాలి
జిల్లాలో సహజ వ్యవసాయ విస్తరణకు కృషి చేస్తున్నాం: కలెక్టర్ ఓ. ఆనంద్
రాప్తాడు ఆంధ్రప్రభ : రాయలసీమ ప్రాంతానికి అనంతపురం జిల్లా సహజ వ్యవసాయంలో ఆదర్శంగా నిలిచి, దేశానికే మార్గదర్శకంగా మారగలదని జిల్లా కలెక్టర్ ఓ. ఆనంద్ పేర్కొన్నారు.
ప్రపంచ ఎడారీకరణ, కరువు నివారణ దినోత్సవం–2026 సందర్భంగా రాప్తాడు మండల పరిధిలోని పంగల్ రోడ్డులో ఉన్న యాక్షన్ ఫ్రాటెర్నా–ఎకాలజీ సెంటర్ (ఏఎఫ్-ఈసీ)లో రైతులతో సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా కలెక్టర్ ఓ. ఆనంద్ హాజరయ్యారు.
ముందుగా ఉత్తమ రైతులు, సీనియర్ రైతులు, ఇతర అధికారులతో ముఖాముఖి పరిచయ కార్యక్రమంలో పాల్గొన్నారు. అనంతరం ప్రాంగణంలో వివిధ ప్రభుత్వ శాఖలు, ప్రైవేటు సంస్థల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వ్యవసాయ అనుబంధ స్టాళ్లు, నమూనా ఫారాలు, వాతావరణ మార్పులను తట్టుకునే వ్యవసాయ నమూనాలను ప్రదర్శిస్తున్న క్షేత్రాలు, అటవీ శాఖ, వ్యవసాయ శాఖల ఆధ్వర్యంలో విత్తన బంతుల తయారీ, సహజ వ్యవసాయ విధానాలు, రైతులకు ఉపయోగపడే పరికరాలపై ఏర్పాటు చేసిన స్టాళ్లను డైరెక్టర్ వై.వి. మల్లారెడ్డితో కలిసి పరిశీలించి నిర్వాహకులను అభినందించారు.
అనంతరం సమావేశ మందిరంలో జ్యోతి ప్రజ్వలన చేశారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ, జిల్లాలో వాతావరణ మార్పులను తట్టుకునే వ్యవసాయ విధానాలు, సహజ వ్యవసాయాన్ని ప్రోత్సహించేందుకు రైతులు, స్వచ్ఛంద సంస్థలు చేస్తున్న కృషిని అభినందించారు. ప్రస్తుతం జిల్లాలో 85 వేల ఎకరాల్లో సాగవుతున్న సహజ వ్యవసాయం వచ్చే ఏడాదికి 2 లక్షల ఎకరాలకు చేరుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.
ప్రస్తుత ఖరీఫ్ సీజన్లో ఫ్రీ-మాన్సూన్ డ్రై సోయింగ్ (పీఎండీఎస్) కార్యక్రమాన్ని జిల్లాలో 2 లక్షల ఎకరాల్లో అమలు చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుందన్నారు. ఈ భూముల్లో సహజ వ్యవసాయాన్ని విస్తరించడంతో పాటు అదనంగా 35 వేల ఎకరాల బంజరు భూమిని సాగులోకి తీసుకురావడానికి చర్యలు చేపడుతున్నామని తెలిపారు.
అనంతరం సదస్సుకు స్వాగతం పలికిన యాక్షన్ ఫ్రాటెర్నా–ఎకాలజీ సెంటర్ డైరెక్టర్ డాక్టర్ వై.వి. మల్లారెడ్డి మాట్లాడుతూ, వర్షపాతం స్వభావం మారిపోతోందని, కాలాలు, వాతావరణ పరిస్థితులు రైతుల నియంత్రణలో లేకపోవడంతో రైతులు మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా తమ వ్యవసాయ విధానాలను మార్చుకోవాల్సిన అవసరం ఉందన్నారు.
ప్రస్తుతం జిల్లాలోని 12 గ్రామాల్లో వాతావరణ అనుకూల వ్యవసాయ పద్ధతులను అమలు చేస్తున్నామని, రైతులు కూడా ఈ విధానాలను స్వీకరించాలని కోరారు. ఈ కార్యక్రమం ద్వారా రైతులు తమ అనుభవాలను ఇతర రైతులతో పంచుకోవడమే ప్రధాన ఉద్దేశ్యమని వివరించారు.
అటవీ శాఖ సంరక్షకురాలు ఆర్. యశోదాబాయి మాట్లాడుతూ, రైతులు సాధ్యమైనంత ఎక్కువగా చెట్లు నాటాలని పిలుపునిచ్చారు. జూలై 1 నుంచి నాటేందుకు అటవీ శాఖ 10 లక్షల మొక్కలను సిద్ధం చేసిందన్నారు.
సహజ వ్యవసాయానికి చెట్లు ఎంతో అవసరమని, వేప, కానుగ వంటి చెట్లు లేకుండా జీవ ఎరువులు, జీవ పురుగుమందులు తయారు చేయడం సాధ్యం కాదన్నారు. అందువల్ల రైతులు తప్పనిసరిగా చెట్ల పెంపకంపై దృష్టి పెట్టాలని సూచించారు.
ఈ కార్యక్రమానికి సుమారు 500 మంది రైతులు హాజరయ్యారు.
ఈ కార్యక్రమంలో సోషల్ ఫారెస్ట్రీ డివిజనల్ ఫారెస్ట్ ఆఫీసర్ గురు ప్రభాకర్, జిల్లా వ్యవసాయ అధికారి ఎన్. సాలు రెడ్డి, జిల్లా ఉద్యానశాఖ అధికారి ఉమాదేవి, ఏపీఎంఐపీ ప్రాజెక్ట్ డైరెక్టర్ బి. రఘునాథ రెడ్డి, వ్యవసాయ పరిశోధన కేంద్రం (ఏఆర్ఎస్) ప్రధాన శాస్త్రవేత్త విజయశంకర్ బాబు, నాబార్డ్ డీడీఎం కె. అనూరాధ, రైఎస్ఎస్ సీటీవో లక్ష్మానాయక్, రేకులకుంట వ్యవసాయ పరిశోధన కేంద్రం మిల్లెట్స్ శాస్త్రవేత్త నర్సింహులు తదితరులు పాల్గొన్నారు.
