హంద్రీనీవాను నాశనం చేసిన క్రెడిట్ మీదే..!

హంద్రీనీవాను నాశనం చేసిన క్రెడిట్ మీదే..!
రాప్తాడు, ఆంధ్రప్రభ : హంద్రీనీవాను నాశనం చేసిన క్రెడిట్ తెలుగుదేశం పార్టీ నేతలదేనని రాప్తాడు మాజీ ఎమ్మెల్యే నియోజకవర్గం సమన్వయకర్త తోపుదుర్తి ప్రకాష్‌రెడ్డి మండిపడ్డారు. సోమవారం విలేకరుల సమావేశంలో మాజీ ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రాజెక్టులంటే రైతులకు నీళ్లు ఇవ్వడానికనేది దివంగత వైఎస్ రాజశేఖర్‌రెడ్డి నిర్వచనమైతే కాంట్రాక్టర్లకు దోచి పెట్టడానికి అనేది చంద్రబాబు నిర్వచనం అన్నారు. చంద్రబాబు హయాంలో నిధులు పారడం తప్ప నీళ్లు పారలేదన్నారు.
రైతుల ప్రయోజనాలను తుంగలో తొక్కి నిధులను పారించారని మండిపడ్డారు. హంద్రీనీవా కాలువను తాము మొదలు పెట్టామని టీడీపీ నాయకులు డబ్బా కొట్టుకుంటున్నారన్నారు. హంద్రీనీవా కాలువకు దివంగత ఎన్టీఆర్ డీపీఆర్ చేయించారన్నారు. రాయలసీమ జిల్లాలకు 40 టీఎంసీల తాగు సాగునీరు అందించే ఏకైక ప్రాజెక్ట్ ఇది అన్నారు. 40 టీఎంసీల నీటిని లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా తీసుకురావడం సాధ్యం కాదని చెప్పి కేవలం 5 టీఎంసీల తాగునీటికి పరిమితం చేస్తూ చంద్రబాబు జీఓ తెచ్చారన్నారు. ఇందుకు అనుగుణంగా డీపీఆర్‌ను మార్పు చేయించారన్నారు.
వైఎస్ రాజశేఖర్‌రెడ్డి సీఎం అయిన తర్వాత తిరిగి 40 టీఎంసీలకు పెంచుతూ జీఓ తెచ్చారన్నారు. అంతేకాకుండా పనులు మొదలుపెట్టి మొదటిపేజ్‌లో జీడిపల్లి రిజర్వాయర్ వరకు నీళ్లు కూడా తెచ్చారన్నారు. ఆయన పుణ్యాన ఈరోజు నీళ్లు మనం చూస్తున్నామన్నారు. రెండోదశ పనులు కూడా దాదాపు 70 శాతం పూర్తి చేసిన ఘనత రాజశేఖర్‌రెడ్డిదే అన్నారు. తామే హంద్రీనీవాను తీసుకొచ్చామని జిల్లాను శశ్యశ్యామలం చేశామని ఆ క్రెడిట్ మాదేనంటూ టీడీపీ మంత్రులు ఎమ్మెల్యేలు ఊకదంపుడు ఉపన్యాసాలు ఇస్తారన్నారు.
అవును హంద్రీనీవాను నాశనం చేసిన క్రెడిట్ మీదేనన్నారు. రైతులకు సంపూర్ణ రుణమాఫీ చేస్తామని హామీ ఇచ్చి 2014లో గద్దెనెక్కిన చంద్రబాబు రైతులను నడ్డివిరిచే కార్యక్రమాలకు పూనుకున్నారని మండిపడ్డారు. ఇందులో భాగంగా హంద్రీనీవా మిగులు పనులకు అనేకరెట్లు ధరలు పెంచి నిధుల దోపిడీకి తెర తీశారన్నారు.అయినా సంపూర్ణంగా కాలువ పనులు చేయలేదన్నారు. మొదటిదశ హంద్రీనీవా కాలువ అంటే మల్యాల నుంచి జీడిపల్లి వరకు 3850 క్యూసెక్కుల నీరు వచ్చేందుకు వెడల్పు చేస్తామంటూ టెండర్లు పిలిచి సుమారు రూ.430 కోట్లు పనులు కూడా చేశారు.
ఈ పనులు వెడల్పు చేసిన తర్వాత 63 టీఎంసీలకు పెంచి జీడిపల్లి–అప్పర్‌పెన్నార్ ప్రాజెక్ట్ జీడీపల్లి–బీటీపీ ప్రాజెక్ట్ నిర్మాణాలకు టెండర్లు పిలిపించారు. కాలువ వెడల్పు నిర్మాణ పనులు పూర్తికాకుండానే వీటికి టెండర్లు పిలవడం వెనుక ఆంతర్యమేమిటి అని ప్రశ్నించారు?ఆ పెండింగ్ పనులకు మళ్లీ ఇప్పుడు రూ.700 కోట్లకు అంచనాలు పెంచి పనులు చేపడుతున్నారన్నారు. ఇందులో అదనంగా రూ. 300 కోట్లు దోపిడీ చేయనున్నారన్నారు.
మొన్నటిదాకా కూడా 2200 క్యూసెక్కుల నీళ్లు మాత్రమే వచ్చాయన్నారు. 52 టీఎంసీల నీటిని తీసుకొచ్చామని టీడీపీ వాళ్లు గొప్పలు చెప్పుకుంటున్నారన్నారు. ఎక్కడికి తీసుకొచ్చారో చెప్పాలని డిమాండ్ చేశారు. కుప్పంకు నీళ్లు తీసుకుపోవాలనే ఉద్దేశంతో కాలువకు కాంక్రీట్ లైనింగ్ వేశారు. ఫలితంగా కాలువ కింద ఉన్న వందలాది గ్రామాల్లో భూగర్భజలాలు అడుగంటి వేలాది బోర్లు ఎండిపోయాయి. హంద్రీనీవా నుంచి 63 టీఎంసీలకు పెంచి, మరోవైపు గాలేరు–నగరి ద్వారా చిత్తూరు జిల్లాకు 20 టీఎంసీల నీటిని ఎత్తిపోతల పథకం ద్వారా తరలిచేందుకు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పనులు కూడా చేపట్టారు.
దాదాపు 50 శాతం పనులు పూర్తయ్యాయి.అంటే మొత్తం 83 టీఎంసీల నీటిని వినియోగించుకునేందుకు చర్యలు తీసుకున్నారు. చంద్రబాబు 43 టీఎంసీలకే పరిమితం చేసి కేవలం ఆయన బినామీ కాంట్రాక్టర్లకు దోచిపెట్టేందుకే రూ.3850 కోట్లతో కాలువ లైనింగ్ పనులు చేపట్టారన్నారు. పనులన్నీ నాసిరకంగా చేపట్టారన్నారు.మీకు కమీషన్లు ఇచ్చే కంపెనీలకు పనులు కట్టబెట్టారన్నారు. అనంతపురం నుంచి చిత్తూరు దాకా చేపట్టిన లైనింగ్ పనులకు సంబంధించి వందచోట్ల కంకరమొత్తం రాలిపోయిందన్నారు.
ఆదాయం వస్తుందంటేనే పనులు చేపట్టి దానికి అభివృద్ధి అని పేరు పెడుతున్నారు. రాష్ట్రంలో ఎక్కడికి వెళ్లినా చదరపు అడుగుకు రూ.2000 వేల నుంచి రూ. 4000 వేల దాకా ఖర్చవుతుంటే అమరావతిలో మాత్రం రూ.14 వేలు ఎందుకు ఖర్చు చేస్తున్నారని ప్రశ్నించారు. మడకశిర బ్రాంచ్ కెనాల్ ద్వారా నామమాత్రపు ఖర్చుతో పేరూరు డ్యాంకు నీళ్లు ఇచ్చే అవకాశం ఉన్నా పట్టించుకోలేదు. ఎందుకంటే వారికి నిధులు పారాలి.నీళ్లు కాదు అని మండిపడ్డారు.
డ్యాం ఎండిపోయి ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఇటీవల సత్యసాయి జిల్లా కలెక్టర్‌ను కలిసి విన్నవించినా లాభం లేకపోయిందన్నారు. హంద్రీనీవా కాలువను వారి ఆదాయ మార్గాలకు మాత్రమే ఉపయోగించుకుంటున్నారు. నాసిరకం లైనింగ్ పనులపై విచారణకు ఆదేశించి చర్యలు తీసుకోవాలి. పిల్లకాలవల నిర్మాణాలకు టెండర్లు పిలిచి పూర్తి చేయాలి. లేదంటే ప్రజాకోర్టులో తప్పకుండా శిక్ష వేస్తారని అన్నారు.
