నకిలీ ఉత్పత్తులపై కఠిన చర్యలు తీసుకోవాలి
నకిలీ ఉత్పత్తులపై కఠిన చర్యలు తీసుకోవాలి
- ఏఐవైఎఫ్ డిమాండ్
బెజ్జంకి, ఆంధ్రప్రభ : మండలంలో రైతుల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని ఎరువులు, విత్తనాలు మరియు పురుగుమందుల దుకాణాలపై వ్యవసాయ శాఖ అధికారులు ప్రత్యేక తనిఖీలు నిర్వహించాలని అఖిల భారత యువజన సమాఖ్య (AIYF) మండల కార్యదర్శి దొంతరవేణి మహేష్ డిమాండ్ చేశారు.
ప్రస్తుతం రైతులు సాగు పనులకు సిద్ధమవుతున్న సమయంలో మార్కెట్లో నకిలీ విత్తనాలు, నాణ్యతలేని ఎరువులు, పురుగుమందులు విక్రయమవుతున్నాయని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ఇవి రైతులకు ఆర్థిక నష్టాలను కలిగించే ప్రమాదం ఉందన్నారు.
ఈ నేపథ్యంలో మండల వ్యాప్తంగా ఉన్న అన్ని దుకాణాలను క్షుణ్ణంగా తనిఖీ చేసి నాణ్యత ప్రమాణాలు పాటించని వ్యాపారులపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. విత్తనాలు, ఎరువుల నమూనాలను సేకరించి ప్రయోగశాల పరీక్షలకు పంపించాలని సూచించారు. నకిలీ లేదా గడువు ముగిసిన ఉత్పత్తులను విక్రయిస్తున్న దుకాణాల లైసెన్సులను రద్దు చేయాలని, రైతులకు నాణ్యమైన ఉత్పత్తులు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని అన్నారు. రైతులు కొనుగోలు చేసే సమయంలో తప్పనిసరిగా బిల్లు తీసుకోవాలని అవగాహన కల్పించాలని సూచించారు.
దుకాణాల్లో నిల్వలో ఉన్న స్టాక్ వివరాలు, ధరలు స్పష్టంగా బోర్డులపై ప్రదర్శించాల్సిన అవసరం ఉందన్నారు. వ్యవసాయ అధికారులు రైతు వేదికల ద్వారా నకిలీ విత్తనాలపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని కోరారు. ముందస్తు సమాచారం ఇచ్చి తనిఖీలు చేయకుండా ఆకస్మికంగా తనిఖీలు నిర్వహించి అక్రమాలకు పాల్పడుతున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. రైతుల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని నామమాత్రపు తనిఖీలకు పరిమితం కాకుండా సమగ్రంగా తనిఖీలు చేపట్టి అక్రమాలను అరికట్టాలని AIYF బెజ్జంకి మండల సమితి తరఫున విజ్ఞప్తి చేశారు.
