లాటరీ పేరుతో లూటీ
లాటరీ పేరుతో లూటీ
రూ.5 లక్షల బహుమతి వచ్చిందంటూ నమ్మించి మోసం
యువతి నుంచి రూ.47 వేలు కాజేసిన సైబర్ నేరగాళ్లు
జైపూర్, (ఆంధ్రప్రభ): ఆన్‌లైన్ లాటరీలో భారీ బహుమతి వచ్చిందంటూ నమ్మించి ఓ యువతి నుంచి రూ.47 వేలకుపైగా కాజేసిన ఘటన జైపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మండలంలోని మిట్టపెల్లి గ్రామానికి చెందిన అశ్విని ఐటీ ఉద్యోగిగా పనిచేస్తోంది. ఆమెకు గుర్తు తెలియని వ్యక్తి నుంచి వాట్సాప్ కాల్ వచ్చింది. కేరళ డైలీ మెగా జాక్‌పాట్ లక్కీ లాటరీ టికెట్ కేవలం రూ.40కే లభిస్తుందని, దాన్ని కొనుగోలు చేస్తే భారీ బహుమతి గెలుచుకునే అవకాశం ఉంటుందని నమ్మించాడు.
దీంతో అశ్విని ఆన్‌లైన్‌లో టికెట్ కొనుగోలు చేసింది. అనంతరం తనకు రూ.5 లక్షల బహుమతి వచ్చిందని, ఆ మొత్తాన్ని పొందాలంటే జీఎస్టీ కింద రూ.24,400 చెల్లించాలని సైబర్ నేరగాడు సూచించాడు. బహుమతి వస్తుందనే ఆశతో ఆమె ఫోన్‌పే ద్వారా ఆ మొత్తాన్ని పంపించింది.
అంతటితో ఆగకుండా ప్రాసెసింగ్ ఫీజు పేరుతో మరో రూ.5,000, ఆర్బీఐ ట్యాక్స్ పేరుతో రూ.17,600 చెల్లించాలని చెప్పి మొత్తంగా రూ.47 వేలకుపైగా వసూలు చేశాడు. అనంతరం అతనికి పంపిన సందేశాలకు ఎలాంటి స్పందన రాకపోవడంతో తాను మోసపోయినట్లు అశ్విని గుర్తించింది.
వెంటనే సైబర్ హెల్ప్‌లైన్ 1930కు ఫోన్ చేసి ఫిర్యాదు నమోదు చేసింది. అనంతరం పోలీసులను ఆశ్రయించింది. బాధితురాలి ఫిర్యాదు మేరకు చీటింగ్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ భూమేష్ తెలిపారు.
