తెరుచుకోనున్న ప్రకాశం బ్యారేజ్ గేట్లు

తెరుచుకోనున్న ప్రకాశం బ్యారేజ్ గేట్లు

కృష్ణాలో పెరిగిన నీటి ప్రవాహం..

దిగువకు 3 వేల క్యూసెక్కుల విడుదలకు ఏర్పాట్లు

నదీ పరివాహక ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారుల హెచ్చరిక

విజయవాడ, ఆంధ్రప్రభ: ఇటీవల కురిసిన వర్షాల ప్రభావంతో కృష్ణా నది పరివాహక ప్రాంతాల నుంచి ప్రకాశం బ్యారేజ్కు నీటి ప్రవాహాలు పెరిగాయి. ఈ నేపథ్యంలో బ్యారేజ్‌లోకి వస్తున్న మిగులు జలాలను దిగువకు విడుదల చేయాలని అధికారులు నిర్ణయించారు.

కృష్ణా సెంట్రల్ డివిజన్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్, రివర్ కన్జర్వేటర్ విడుదల చేసిన ప్రకటన ప్రకారం.. ఆదివారం ఉదయం 9 గంటల నుంచి 10 గంటల మధ్య ప్రకాశం బ్యారేజ్ గేట్లను ఎత్తి సుమారు 2,000 నుంచి 3,000 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేయనున్నారు. వర్షపాతం పరిస్థితులు, ఎగువ ప్రాంతాల నుంచి వచ్చే ప్రవాహాలను బట్టి నీటి విడుదల పరిమాణంలో మార్పులు ఉండే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.

స్థానిక వర్షాల కారణంగా కృష్ణా నదిలోకి వరద ప్రవాహాలు పెరుగుతున్న నేపథ్యంలో అవసరమైతే అదనపు నీటి విడుదలకు కూడా సన్నాహాలు చేస్తున్నట్లు పేర్కొన్నారు.

ఈ నేపథ్యంలో కృష్ణానది ఎగువ, దిగువ పరివాహక ప్రాంతాల్లో నివసించే ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. నదీ తీర ప్రాంతాల్లో సంచరించే వారు, మత్స్యకారులు, ఇసుక రీచ్‌లలో పనిచేస్తున్న కార్మికులు ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలని హెచ్చరించారు.

అలాగే నదీ తీర ప్రాంతాల్లో పనులు నిర్వహిస్తున్న వివిధ శాఖల అధికారులు, సిబ్బంది పరిస్థితిని ఎప్పటికప్పుడు గమనిస్తూ భద్రతా చర్యలు చేపట్టాలని సూచించారు. నీటి విడుదల సమయంలో ఎవరూ నదిలోకి వెళ్లరాదని, అవాంఛనీయ ఘటనలు జరగకుండా అప్రమత్తంగా ఉండాలని అధికారులు కోరారు.

కృష్ణానది పరివాహక ప్రాంత ప్రజలు అధికారుల సూచనలను తప్పనిసరిగా పాటించి భద్రతకు ప్రాధాన్యం ఇవ్వాలని నీటిపారుదల శాఖ విజ్ఞప్తి చేసింది.

Leave a Reply