వేసవి సెలవులకు వచ్చిన బాలికపై లైంగిక దాడి..
అశ్వారావుపేట రూరల్, ఆంధ్రప్రభ : వేసవి సెలవుల సందర్భంగా బంధువుల ఇంటికి వచ్చిన ఓ బాలికపై లైంగిక దాడి యత్నం జరిగిన ఘటన అశ్వారావుపేట మండలంలో చోటుచేసుకుంది.
వివరాల ప్రకారం, కుకునూరు మండలంలోని కిష్టారం గ్రామానికి చెందిన ఐదో తరగతి చదువుతున్న ఓ బాలిక అశ్వారావుపేట మండలంలోని నందిపాడు గ్రామంలో ఉన్న తన బంధువుల ఇంటికి వచ్చింది. ఈ క్రమంలో శుక్రవారం సాయంత్రం ఇంటి ఎదురుగా ఉన్న పాన్ షాప్ వద్దకు వెళ్లిన సమయంలో అక్కడ ఉన్న ఓ వ్యక్తి బాలికపై లైంగిక దాడి యత్నానికి పాల్పడినట్లు సమాచారం.
బాలికపై దాడి యత్నం జరుగుతున్న విషయాన్ని గమనించిన కుటుంబ సభ్యులు వెంటనే అక్కడికి చేరుకుని నిందితుడిని పట్టుకునేందుకు ప్రయత్నించారు. అయితే కుటుంబ సభ్యులు వస్తున్నట్లు గుర్తించిన నిందితుడు అక్కడి నుంచి పరారైనట్లు స్థానికులు తెలిపారు.
ఘటనపై బాధిత కుటుంబ సభ్యులు పోలీసులకు సమాచారం అందించగా, పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు తెలిసింది. పరారీలో ఉన్న నిందితుడి కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి.
