బీఎల్‌ఏలు అప్రమత్తంగా ఉండాలి: రాయల నాగేశ్వరరావు
మధిర, ఆంధ్రప్రభ : ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్‌ఐఆర్) ప్రక్రియను వ్యతిరేకిస్తూ ఆదివారం మధిరలోని రెడ్డి గార్డెన్ కళ్యాణ మండపంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నియోజకవర్గ స్థాయి సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో రాష్ట్ర గిడ్డంగుల సంస్థ చైర్మన్ రాయల నాగేశ్వరరావు పాల్గొని మాట్లాడారు.
కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం ఓటర్ల జాబితా సవరణ పేరుతో అర్హులైన ఓటర్ల పేర్లను తొలగించే ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ప్రజాస్వామ్య వ్యవస్థలో ఓటు హక్కు అత్యంత విలువైనదని పేర్కొన్న ఆయన, ప్రతి అర్హుడైన పౌరుడి పేరు ఓటర్ల జాబితాలో ఉండేలా అధికారులు చర్యలు తీసుకోవాలని కోరారు.
ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియను పారదర్శకంగా, నిష్పక్షపాతంగా నిర్వహించాల్సిన బాధ్యత ఎన్నికల సంఘంపై ఉందన్నారు. ఈ విషయంలో బూత్ స్థాయి ఏజెంట్లు (బీఎల్‌ఏలు) అప్రమత్తంగా ఉండి ప్రతి ఓటరుకు న్యాయం జరిగేలా చూడాలని సూచించారు.
రాజకీయ ప్రయోజనాల కోసం ఓటర్ల జాబితాలో మార్పులు చేయాలనే ప్రయత్నాలను కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా వ్యతిరేకిస్తుందని రాయల నాగేశ్వరరావు స్పష్టం చేశారు. ప్రజలు తమ పేర్లు ఓటర్ల జాబితాలో ఉన్నాయో లేదో స్వయంగా పరిశీలించుకోవాలని, ఏవైనా లోపాలు ఉంటే వెంటనే సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లాలని సూచించారు.
