వైభవంగా లక్ష్మీనరసింహ స్వామివారి పల్లకి సేవ
వైభవంగా లక్ష్మీనరసింహ స్వామివారి పల్లకి సేవ
భక్తులతో కిటకిటలాడిన పెన్నాహోబిలం దేవాలయం
ఉరవకొండ రూరల్, ఆంధ్రప్రభ : జిల్లాలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన పెన్నాహోబిలంలోని లక్ష్మీనరసింహ స్వామివారి దేవాలయంలో శనివారం పల్లకి సేవ కార్యక్రమాన్ని అత్యంత వైభవంగా నిర్వహించారు.
ఈ సందర్భంగా సుప్రభాత సేవలో భాగంగా తెల్లవారుజామున స్వామివారి మూలవిరాట్‌కు అభిషేకం నిర్వహించి, పుష్పాలు, ఆభరణాలతో ప్రత్యేకంగా అలంకరించారు. అనంతరం అర్చనలు, పూజా కార్యక్రమాలు, మహా మంగళహారతి నిర్వహించారు.
భూదేవి, శ్రీదేవి సమేతుడైన నరసింహ స్వామి ఉత్సవమూర్తులను పల్లకిలో కొలువుదీర్చి, భజన బృందాల నడుమ దేవాలయ ప్రాంగణంలో ఘనంగా ఊరేగించారు. ఈ ఆధ్యాత్మిక వేడుక భక్తులను విశేషంగా ఆకట్టుకుంది.
స్వామివారిని దర్శించుకునేందుకు ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తెలంగాణ రాష్ట్రాల నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో తరలిరావడంతో దేవాలయ ప్రాంగణం భక్తులతో కిక్కిరిసిపోయింది. భక్తులు స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించి తమ మొక్కుబడులు తీర్చుకున్నారు.
ఈ కార్యక్రమంలో దేవస్థానం ఈవో సాకే రమేష్‌బాబు, ప్రధాన అర్చకులు ద్వారకనాథ్ చార్యులు, అర్చకులు మయూరం బాలాజీ, మారుతి ప్రసాద్, లీలావతి, ప్రకాష్, నాగేంద్ర తదితరులు పాల్గొన్నారు.
