బియ్యం ధరల నియంత్రణకు ప్రభుత్వ ప్రత్యేక చర్యలు

  • శ్రీ సత్యసాయి జిల్లాలో 15 మండలాల్లో ప్రత్యేక బియ్యం విక్రయ కేంద్రాలు
  • కొత్తచెరువులో కేంద్రాన్ని ప్రారంభించిన కలెక్టర్ ఎ. శ్యాంప్రసాద్
  • స్టీమ్ రైస్ కిలో రూ.52, ముడిబియ్యం కిలో రూ.50కే విక్రయం
  • ప్రభుత్వ కేంద్రాల్లోనే నాణ్యమైన బియ్యం కొనుగోలు చేయాలని ప్రజలకు కలెక్టర్ పిలుపు

శ్రీ సత్యసాయి బ్యూరో, ఆంధ్రప్రభ: బహిరంగ మార్కెట్‌లో బియ్యం ధరలను నియంత్రించి సామాన్య ప్రజలకు అందుబాటు ధరల్లో నాణ్యమైన బియ్యం అందించాలనే లక్ష్యంతో శ్రీ సత్యసాయి జిల్లా వ్యాప్తంగా 15 మండలాల్లో ప్రత్యేక బియ్యం విక్రయ కేంద్రాలను సోమవారం ప్రారంభించారు.

ఈ కార్యక్రమంలో భాగంగా కొత్తచెరువు మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక బియ్యం విక్రయ కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ ఎ. శ్యాంప్రసాద్, జిల్లా జాయింట్ కలెక్టర్ ఎం. మౌర్య భరద్వాజ్, మాజీ మంత్రి పల్లె రఘునాథ్ రెడ్డి, జిల్లా పౌరసరఫరాల శాఖ అధికారి, స్థానిక తహసీల్దార్‌తో కలిసి లాంఛనంగా ప్రారంభించారు.

అనంతరం అధికారులు విక్రయ కేంద్రంలో అందుబాటులో ఉన్న బియ్యం నాణ్యతను పరిశీలించి, ప్రజలకు అందిస్తున్న సేవలపై ఆరా తీశారు. మార్కెట్‌లో వ్యాపారులు కృత్రిమ కొరత సృష్టించడం, బియ్యం ధరలను అనవసరంగా పెంచడం వంటి పరిస్థితులను అరికట్టేందుకు ప్రభుత్వం ఈ ప్రత్యేక కార్యక్రమాన్ని అమలు చేస్తోందని తెలిపారు. ప్రజలపై అదనపు ఆర్థిక భారం పడకుండా నాణ్యమైన బియ్యాన్ని రాయితీ ధరలకు అందించడం ద్వారా మార్కెట్‌లో ధరలను నియంత్రించాలన్నదే ప్రభుత్వ ప్రధాన ఉద్దేశమని పేర్కొన్నారు.

జిల్లాలో ఏర్పాటు చేసిన ప్రత్యేక విక్రయ కేంద్రాల్లో సూపర్ ఫైన్ స్టీమ్ రైస్ (బీపీటీ) కిలో రూ.52, ముడిబియ్యం (బీపీటీ) కిలో రూ.50 చొప్పున విక్రయిస్తున్నట్లు అధికారులు తెలిపారు. మార్కెట్‌లో బియ్యం ధరలు సాధారణ స్థితికి చేరుకునే వరకు ఈ ప్రత్యేక విక్రయ కేంద్రాలు నిరంతరం కొనసాగుతాయని వెల్లడించారు.

ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ ఎ. శ్యాంప్రసాద్ మాట్లాడుతూ.. ప్రజలకు నాణ్యమైన బియ్యాన్ని సబ్సిడీ ధరలకు అందించడం ద్వారా మార్కెట్‌లో ధరల నియంత్రణ సాధ్యమవుతుందన్నారు. దళారులు లేదా అధిక ధరలకు విక్రయించే వ్యాపారులను ఆశ్రయించకుండా ప్రభుత్వం ఏర్పాటు చేసిన ప్రత్యేక విక్రయ కేంద్రాల ద్వారానే బియ్యం కొనుగోలు చేసి ఈ అవకాశాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ప్రభుత్వం చేపట్టిన ఈ చర్యకు ప్రజలు సహకరించాలని కోరారు.

జిల్లాలోని రోద్దం, బత్తలపల్లి, సి.కే.పల్లి, గాండ్లపెంట, గోరంట్ల, హిందూపూర్, కదిరి, కొత్తచెరువు, మడకశిర, ముదిగుబ్బ, పెనుగొండ, పుట్టపర్తి, తాడిమర్రి, ధర్మవరం, లేపాక్షి మండలాల్లో ప్రత్యేక బియ్యం విక్రయ కేంద్రాలు అందుబాటులోకి వచ్చాయని అధికారులు తెలిపారు. ప్రజలు తమకు సమీపంలోని ప్రభుత్వ కేంద్రాలను వినియోగించుకుని నాణ్యమైన బియ్యాన్ని తక్కువ ధరలకు కొనుగోలు చేయాలని విజ్ఞప్తి చేశారు.