TMC Leader Attack | ఇంట్లోకి చొర‌బ‌డి.. కోడిగుడ్డుతో కొట్టి

TMC Leader Attack | ఇంట్లోకి చొర‌బ‌డి.. కోడిగుడ్డుతో కొట్టి

టీఎంసీ నేత దాడి

TMC Leader Attack |ఆంధ్ర‌ప్ర‌భ వెబ్‌డెస్క్ : పశ్చిమ బెంగాల్‌లోని నాదియా జిల్లాలో మాజీ మంత్రి, తృణమూల్ కాంగ్రెస్ (TMC) నేత ఉజ్జల్ బిస్వాస్ ఇంట్లోకి స్థానికులు, బీజేపీ కార్యకర్తలు చొరబడి ఆయన ముఖానికి కోడిగుడ్డు కొట్టారు. ప్రభుత్వ సాయం కింద పేదలకు పంచాల్సిన సామగ్రిని, దుస్తులను అక్రమంగా ఇంట్లో దాచుకున్నారనే ఆరోపణలతో ఈ దాడి జరిగింది. అనంతరం పోలీసులు ఆయనను అరెస్ట్ చేశారు.

టీఎంసీ నేతలపై ఆగ్రహం..
పశ్చిమ బెంగాల్‌లో టీఎంసీ నేతలపై స్థానికుల ఆగ్రహం, దాడులు అంతకంతకూ పెరుగుతున్నాయి. అవినీతి, దోపిడీ ఆరోపణలతో తాజాగా నాదియా జిల్లాలోని కృష్ణానగర్‌లో ఉన్న మాజీ మంత్రి ఉజ్జల్ బిస్వాస్ (Ujjal Biswas) ఇంటిపై స్థానికులు, బీజేపీ కార్యకర్తలు దాడికి పాల్పడ్డారు.

కోడిగుడ్లతో దాడి.. తీవ్ర ఉద్రిక్తత
అధికారంలో ఉండగా ప్రజాధనాన్ని, పేదలకు అందాల్సిన సాయాన్ని టీఎంసీ నేతలు దోచుకున్నారంటూ పెద్ద ఎత్తున ప్రజలు నిరసనకు దిగారు. ఈ క్రమంలోనే కోపోద్రిక్తులైన జనం మాజీ మంత్రి ఉజ్జల్ బిస్వాస్ ఇంట్లోకి చొరబడ్డారు. ఆయన్ను దూషిస్తూ, ముఖంపై కోడిగుడ్డుతో కొట్టడంతో ఆ ప్రాంతంలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది.అక్రమ నిల్వలపై కేసు నమోదుప్రభుత్వ సామగ్రి అయిన టార్పాలిన్లు, చీరలు, ధోతీలు, ఇతర దుస్తులను దుర్వినియోగం చేశారని.. ఎలాంటి పంపిణీ చేయకుండా అక్రమంగా తన ఇంట్లో నిల్వ ఉంచుకున్నారని ఆయనపై స్థానికులు ఆరోపించారు. ఈ ఆరోపణల మేరకు కోత్వాలి పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేసిన పోలీసులు, మాజీ మంత్రి ఉజ్జల్ బిస్వాస్‌ను అదుపులోకి తీసుకున్నారు.