Harishrao | అంతర్యం ఏమిటో?
Harishrao | అంతర్యం ఏమిటో?
Harishrao | ఆంధ్రప్రభ వెబ్‌డెస్క్ : తెలంగాణా రాజకీయాల్లో అనూహ్య పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. ఓవైపు బీఆర్ఎస్ నేత హరీశ్ రావు ఢిల్లీ ఆకస్మిక పర్యటన రాజకీయాల్లో ఉత్కంఠ రేపుతుండగా.. మరో వైపు కాంగ్రెస్ నాయకుడు జీవన్ రెడ్డి పార్టీని వీడి కేసీఆర్ సభలో బీఆర్ఎస్ లో చేరనుండటం కాంగ్రెస్ గట్టి షాక్ ఇచ్చింది.గులాబీ పార్టీ తాజా వ్యూహలకు ఉలిక్కిపడ్డ కాంగ్రెస్, హరీశ్ రావు, జీవన్ రెడ్డిలపై విమర్మల వర్షం కురింపించింది.
బీఆర్ఎస్‌లో ముసలం – ఎంపీ చామల
బీఆర్ఎస్‌లో చీలిక మొదలైందని ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి అన్నారు. జీవన్ రెడ్డి చేరిక హరీశ్ రావుకు ఇష్టం లేదని, అందుకే కేటీఆర్‌తో వెళ్లలేదని పేర్కొన్నారు. కేసీఆర్ బయటకు వస్తుంటే హరీశ్ ఢిల్లీ వెళ్లడం వెనుక రహస్యముందని, ఆయన ఎవరిని కలిశారో త్వరలోనే బయటపెడతామని సంచలన వ్యాఖ్యలు చేశారు.
బీఆర్ఎస్ చీలికకు ఆయనే కారణం- అద్దంకి
జీవన్ రెడ్డి చేరికతో బీఆర్ఎస్‌లో చీలిక ఖాయమని ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్ అన్నారు. మొదటి నుండి హరీశ్ రావు ఈ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్నారని, ఆయన బీజేపీ నేతలతో కలిసి ఢిల్లీ వెళ్లడంపై అనుమానాలు ఉన్నాయని పేర్కొన్నారు. కేసీఆర్ కేవలం రాజకీయ స్వార్థం కోసమే జీవన్ రెడ్డిని చేరుస్తున్నారని విమర్శించారు.
హరీశ్ రావుపై తుమ్మల నిప్పులు
ప్రాధాన్యత లేకే హరీశ్ రావు పిచ్చిగా మాట్లాడుతున్నారని మంత్రి తుమ్మల ధ్వజమెత్తారు. కాళేశ్వరం అవినీతికి పాల్పడి కాంగ్రెస్‌కు నీతులు చెప్పడం హాస్యాస్పదమన్నారు. ప్రజలను వంచించి రాష్ట్రాన్ని రావణకాష్టం చేశారని, మీ దోపిడీని గుర్తించే జనం పక్కన పెట్టారని విమర్శించారు. బీఆర్ఎస్ మళ్ళీ అధికారంలోకి రావడం అసాధ్యమని ఆయన తేల్చిచెప్పారు.
బీజేపీ నేతలతో హరీశ్ రావు- ఎమ్మెల్యే సంజయ్ సంచలనం
జీవన్‌రెడ్డి చేరికతో బీఆర్‌ఎస్‌లో ముసలం మొదలైందని ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ అన్నారు. కేసీఆర్ సభను చిన్న గ్రౌండ్‌లో పెట్టడమే వారి బలహీనతకు నిదర్శనమన్నారు. హరీశ్ రావు ఢిల్లీకి వెళ్లి బీజేపీ నేతలతో సంప్రదింపులు జరుపుతున్నారని, కవిత దారిలోనే ఆయన కూడా వెళ్లే అవకాశం ఉందంటూ సంజయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. గతంలో తెలంగాణను వ్యతిరేకించి, కేసీఆర్, కేటీఆర్, హరీశ్ రావులపై అనుచిత వ్యాఖ్యలు చేసిన జీవన్ రెడ్డిని పార్టీలోకి ఎలా ఆహ్వానిస్తారని ఎమ్మెల్యే సంజయ్ కుమార్ ప్రశ్నించారు.
హరీశ్ ఢిల్లీ పర్యటనపై మంత్రి అడ్లూరి ప్రశ్నలు
బీఆర్ఎస్‌లో వర్గపోరు మొదలైందని మంత్రి అడ్లూరి లక్ష్మణ్ అన్నారు. హరీశ్ రావు ఢిల్లీ పర్యటన వెనుక ఆంతర్యమేమిటో జగిత్యాల సభలో కేసీఆర్, కేటీఆర్ స్పష్టం చేయాలని డిమాండ్ చేశారు. ఢిల్లీలో ఆయన ఏ పార్టీ నేతలను కలుస్తున్నారో సమాధానం చెప్పాలని, బీఆర్ఎస్ పతనం ప్రారంభమైందని ఆయన విమర్శించారు.
ఓ వైపు హస్తినాలో హరీశ్ మంతనాలు, మరోవైపు కారెక్కబొతున్న జీవన్ రెడ్డి.. వెరసి తెలంగాణా రాజకీయాలు రసవత్తరంగా మారాయి.అధికార కాంగ్రెస్ నేతల విమర్శల దాడిని బీఆర్ఎస్ ఎలా తిప్పికొడుతుందో చూడాలి. ఈ పొలిటికల్ మైండ్ గేమ్‌లో పైచేయి ఎవరిదో కాలమే నిర్ణయించాలి.
