Donation Box | ‘రోల్డ్ గోల్డ్’ పేరుతో…

Donation Box | ‘రోల్డ్ గోల్డ్’ పేరుతో…
Donation Box | ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్ : విజయవాడ ఇంద్రకీలాద్రిపై ఉన్న శ్రీ కనకదుర్గమ్మ దేవస్థానంలో హుండీ లెక్కింపులో అక్రమాలు వెలుగులోకి రావడం కలకలం రేపింది. భక్తుల కానుకలను సిబ్బంది మళ్లిస్తున్నట్లు బయటపడింది.
విజయవాడలోని ప్రసిద్ధ శ్రీ కనకదుర్గమ్మ దేవస్థానంలో హుండీ లెక్కింపు సమయంలో అవకతవకలు జరిగిన ఘటన వెలుగులోకి వచ్చింది. కొంతమంది సిబ్బంది బంగారు వస్తువులను ‘రోల్డ్ గోల్డ్’ పేరుతో పక్కకు మళ్లిస్తున్నట్లు గుర్తించారు.
సందేహాస్పదంగా కనిపించిన వస్తువులపై ట్రస్ట్ బోర్డు సభ్యులు, ఎస్పీఎఫ్ సిబ్బంది స్థానిక పోలీసులతో కలిసి తనిఖీలు నిర్వహించగా, సుమారు రూ.1.25 లక్షల విలువైన బంగారం బయటపడింది. ఈ క్రమంలో కొందరు సిబ్బంది రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడ్డారు. ఇలాంటి ఘటనలు ఇదే మొదటిసారి కాదని, గతంలో కూడా పలుమార్లు చోటుచేసుకున్నాయని ట్రస్ట్ సభ్యులు పేర్కొన్నారు. కొత్తగా బాధ్యతలు స్వీకరించిన తర్వాతే ఇలాంటి సంఘటనలు వెలుగులోకి రావడం పలు అనుమానాలకు తావిస్తోంది.
ఈ ఘటనపై దేవస్థానం ఈఓ శీనా నాయక్ స్పందిస్తూ, హుండీ లెక్కింపు సిబ్బందికి మెమోలు జారీ చేసి, సమగ్ర విచారణకు ఆదేశించారు. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. హుండీ లెక్కింపు ప్రక్రియలో పారదర్శకత లోపించడం, సీసీ కెమెరాలు, పర్యవేక్షణ వ్యవస్థలు ఉన్నప్పటికీ అక్రమాలు జరుగుతుండటం భద్రతా వైఫల్యంపై ప్రశ్నలు లేవనెత్తుతోంది. భక్తుల విశ్వాసాన్ని కాపాడేందుకు కఠిన చర్యలు అవసరమని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
