జూన్ 17న నల్గొండ జిల్లాకు సీఎం రేవంత్ రెడ్డి..
జూన్ 17న నల్గొండ జిల్లాకు సీఎం రేవంత్ రెడ్డి..
- రూ.13 వేల కోట్ల హ్యామ్ రోడ్ల పనులకు శంకుస్థాపన
- మంత్రి కోమటిరెడ్డి
నల్గొండ, ఆంధ్రప్రభ : రాష్ట్ర ముఖ్యమంత్రి ఏ. రేవంత్ రెడ్డి ఈ నెల 17న నల్గొండ జిల్లాకు రానున్నట్లు రాష్ట్ర రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి తెలిపారు. జిల్లాలో చేపట్టనున్న భారీ రహదారి అభివృద్ధి పనులకు సీఎం శంకుస్థాపన చేయనున్నట్లు వెల్లడించారు.
బుధవారం నల్గొండ జిల్లాలో వివిధ అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనల సందర్భంగా మాన్యం చెల్క ఉర్దూ మీడియం ప్రాథమిక పాఠశాల భవన నిర్మాణ పనులకు శంకుస్థాపన చేసిన అనంతరం మంత్రి మీడియాతో మాట్లాడారు.
రాష్ట్రంలో సుమారు రూ.13,000 కోట్ల వ్యయంతో హ్యామ్ (Hybrid Annuity Model) రోడ్ల నిర్మాణ కార్యక్రమాన్ని చేపడుతున్నామని తెలిపారు. ఇందులో భాగంగా 6,300 కిలోమీటర్ల రహదారులను డబుల్ రోడ్లుగా అభివృద్ధి చేసేందుకు ఇప్పటికే టెండర్లు పిలిచామని, పనులు త్వరలో ప్రారంభమవుతాయని చెప్పారు.
ఈ నెల 17న కనగల్ సమీపంలో జరిగే కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి హ్యామ్ రోడ్ల పనులకు శంకుస్థాపన చేయనున్నారని, అనంతరం ధర్వేశిపురం ఎల్లమ్మ దేవాలయాన్ని దర్శించుకోనున్నారని తెలిపారు.
పంచాయతీరాజ్ శాఖ ఆధ్వర్యంలో మరో రూ.7,000 కోట్లతో కొత్త రహదారుల నిర్మాణం చేపట్టనున్నట్లు మంత్రి వెల్లడించారు. హ్యామ్ రోడ్ల తొలి ప్యాకేజీ కింద సీఆర్‌ఎఫ్ నిధులతో రూ.300 కోట్ల వ్యయంతో ధర్వేశిపురం–గుర్రంపోడు, కొండమల్లేపల్లి–డిండి మార్గాలను డబుల్ రోడ్లుగా అభివృద్ధి చేస్తున్నట్లు చెప్పారు.
మొత్తం 1,334 ప్యాకేజీలుగా విభజించిన ఈ ప్రాజెక్టులకు సీఎం శంకుస్థాపన చేయనున్నారని, అనంతరం తెలంగాణలోనే అతిపెద్ద బహిరంగ సభను కనగల్ సమీపంలో నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు.
డబుల్ రోడ్ల నిర్మాణంతో రోడ్డు ప్రమాదాలు తగ్గడమే కాకుండా పరిశ్రమల స్థాపనకు అవకాశాలు పెరిగి యువతకు ఉపాధి అవకాశాలు లభిస్తాయని మంత్రి తెలిపారు. నల్గొండతో పాటు వలిగొండ, ఆలేరు తదితర ప్రాంతాల్లో రూ.600 కోట్లతో రహదారి అభివృద్ధి పనులు చేపట్టనున్నట్లు వెల్లడించారు.
అదేవిధంగా నల్గొండ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో రూ.125 కోట్ల వ్యయంతో వాటర్ ట్రీట్‌మెంట్ ప్లాంట్ నిర్మాణానికి ఈ వారంలో టెండర్లు పిలవనున్నట్లు తెలిపారు. నల్గొండ పట్టణాన్ని తెలంగాణలోనే ఆదర్శ నగరంగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటోందన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ బి. చంద్రశేఖర్, నగరపాలక సంస్థ మేయర్ బుర్రి చైతన్య శ్రీనివాస్ రెడ్డి, కార్పొరేటర్లు, అధికారులు తదితరులు పాల్గొన్నారు.
