పాఠశాల ప్రహరీ గోడ మెటీరియల్ ఎక్కడ?

పాఠశాల ప్రహరీ గోడ మెటీరియల్ ఎక్కడ?

మద్దూర్, ఆంధ్రప్రభ: కొడంగల్ నియోజకవర్గంలో రోడ్డు విస్తరణ పనులలో భాగంగా కొత్తపల్లి మండల కేంద్రంలోని ప్రాథమికోన్నత పాఠశాల ప్రహరీ గోడను కూల్చివేశారు. అయితే, ప్రభుత్వ పాఠశాల ప్రహరీ గోడకు సంబంధించిన రాళ్లు, ఇతర నిర్మాణ సామగ్రిని ఎలాంటి అనుమతులు లేకుండా అక్కడి నుంచి తరలించినట్లు స్థానికుల నుంచి ఆరోపణలు వస్తున్నాయి.

ప్రభుత్వ ఆస్తికి సంబంధించిన నిర్మాణ సామగ్రిని అధికారిక ప్రకటన లేకుండా, వేలం నిర్వహించకుండా తరలించారని ప్రజలు ఆరోపిస్తున్నారు. కొత్తపల్లి మండల కేంద్రంలోని ప్రభుత్వ పాఠశాలలో తరగతులకు సరిపడా గదులు లేవన్న అంశంపై వార్త సేకరించడానికి వెళ్లిన ఆంధ్రప్రభ విలేకరికి గ్రామ సర్పంచ్ ఫోన్ చేసి, “నీకు ఎందుకు.. మేము చూసుకుంటాం” అంటూ మాట్లాడినట్లు సమాచారం.

ఈ వ్యవహారంపై ప్రభుత్వం, సంబంధిత అధికారులు వెంటనే స్పందించాలని స్థానికులు కోరుతున్నారు. పాఠశాల ప్రహరీ గోడకు సంబంధించిన మెటీరియల్ ఎక్కడికి తరలించారు? ఎవరి అనుమతితో తరలించారు? అనే విషయాలపై స్పష్టత ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు.

ఈ విషయంపై పాఠశాల ప్రధానోపాధ్యాయులు అందుబాటులో లేకపోవడంతో ఫోన్ ద్వారా సమాచారం కోరగా, రోడ్డు విస్తరణ పనుల్లో భాగంగా ప్రహరీ గోడను కూల్చారని తెలిపారు. అక్కడ ఉన్న మెటీరియల్‌ను క్లియర్ చేయాలని కొత్తపల్లి గ్రామ సర్పంచ్‌కు సమాచారం ఇచ్చినట్లు పేర్కొన్నారు.

మండల విద్యాశాఖ అధికారి ఆర్. ఆంజనేయులను వివరణ కోరగా, ఈ విషయం తమ దృష్టికి రాలేదని తెలిపారు.