యోగాను జీవితంలో భాగం చేసుకోవాలి

యోగాను జీవితంలో భాగం చేసుకోవాలి

ఆరోగ్యవంతమైన చిత్తూరు నిర్మాణానికి ప్రతి ఒక్కరూ యోగా సాధన చేయాలి

చిత్తూరు, ఆంధ్రప్రభ బ్యూరో: యోగాను కేవలం ఒక కార్యక్రమంగా కాకుండా జీవితాంతం ఆచరించే ఆరోగ్యకరమైన జీవన విధానంగా ప్రతి ఒక్కరూ స్వీకరించాలని జిల్లా జాయింట్ కలెక్టర్ ఎ. రాజేంద్రన్ పిలుపునిచ్చారు. ఆరోగ్యవంతమైన సమాజ నిర్మాణానికి యోగా ఎంతో దోహదపడుతుందని, ప్రతి వ్యక్తి తన దైనందిన జీవితంలో యోగాను భాగం చేసుకోవాలని సూచించారు.

మంగళవారం చిత్తూరులోని పీవీకేఎన్ డిగ్రీ కళాశాల మైదానంలో వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన యోగాంధ్ర–2026 కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ ఎ. రాజేంద్రన్, చిత్తూరు ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్, వైద్య ఆరోగ్య శాఖ అధికారులు, విద్యార్థులు, సీనియర్ సిటిజన్లు పాల్గొని యోగా సాధన చేశారు.

జూన్ 21 వరకు యోగాంధ్ర కార్యక్రమాలు

ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తున్న యోగాంధ్ర–2026 కార్యక్రమాలు జూన్ 7 నుంచి 21 వరకు కొనసాగనున్నాయని తెలిపారు. జూన్ 7న యోగా ర్యాలీతో కార్యక్రమాలకు శ్రీకారం చుట్టామని, ప్రస్తుతం గ్రామ స్థాయిలో యోగా ప్రచార కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు చెప్పారు.

జిల్లాలో యోగా గురువులను గుర్తించి వారి ద్వారా 200 మంది మాస్టర్ ట్రైనర్లకు శిక్షణ అందించినట్లు వెల్లడించారు. అనంతరం ప్రతి గ్రామ, వార్డు సచివాలయానికి యోగా శిక్షకులను ఎంపిక చేసి, మొత్తం 9 వేల మందికి పైగా ట్రైనర్లను సిద్ధం చేసినట్లు పేర్కొన్నారు. ప్రస్తుతం వారికి ప్రత్యేక శిక్షణ కొనసాగుతోందని తెలిపారు.

ప్రతి సచివాలయంలో యోగా శిక్షణ

ప్రతి సచివాలయంలో యోగా ట్రైనర్లు కనీసం 100 మంది సభ్యులను గుర్తించి గ్రామ స్థాయిలో యోగా శిక్షణ అందించనున్నట్లు జాయింట్ కలెక్టర్ తెలిపారు. మరో రెండు మూడు రోజుల్లో ఈ కార్యక్రమాన్ని మరింత విస్తృతంగా ప్రారంభించనున్నట్లు వెల్లడించారు.

యోగాంధ్ర కార్యక్రమంలో భాగంగా యోగా పోటీలు, యోగా క్విజ్‌లు, ప్రాణాయామ శిక్షణ, వ్యక్తిగత యోగా ప్రదర్శనలు వంటి కార్యక్రమాలను గ్రామ, మండల, జిల్లా, రాష్ట్ర స్థాయిల్లో నిర్వహించనున్నట్లు వివరించారు. అలాగే వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో వైద్యాధికారులు ప్రత్యేక థీమాటిక్ యోగా కార్యక్రమాలను కూడా నిర్వహిస్తున్నట్లు తెలిపారు.

జూన్ 12న కాణిపాకం దేవస్థానంలో, జూన్ 18న పులిగుండలో ప్రత్యేక థీమాటిక్ యోగా కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు చెప్పారు. జూన్ 21న అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని జిల్లాలో భారీ స్థాయిలో ముగింపు కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు వెల్లడించారు. ప్రజలందరూ రెండు మూడు వారాల కార్యక్రమంగా కాకుండా జీవితాంతం యోగాను అలవాటు చేసుకుని ఆరోగ్యవంతమైన జీవనం గడపాలని ఆకాంక్షించారు.

యోగా, నడకతో ఆరోగ్యం: ఎమ్మెల్యే గురజాల

ఈ సందర్భంగా ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్ మాట్లాడుతూ.. గత ఏడాది ఇదే వేదికపై బరువు తగ్గాలని సంకల్పించానని, ప్రస్తుతం 10 నుంచి 12 కిలోల వరకు బరువు తగ్గినట్లు తెలిపారు. యోగా, నడక, సరైన ఆహార నియమాలు పాటించడం వల్ల ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చని పేర్కొన్నారు.

ప్రస్తుత జీవన విధానంలో ఒత్తిడులు ఎక్కువగా ఉన్నప్పటికీ ఆరోగ్యం కోసం ప్రతి ఒక్కరూ యోగాను అలవాటు చేసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. తాను కూడా ఇకపై క్రమం తప్పకుండా యోగా చేయడానికి కృషి చేస్తానని చెప్పారు.

జూన్ 21న నిర్వహించే అంతర్జాతీయ యోగా దినోత్సవ కార్యక్రమంలో భారీ సంఖ్యలో ప్రజలను భాగస్వామ్యం చేస్తామని తెలిపారు. చిత్తూరు జిల్లాను ఆరోగ్యవంతమైన జిల్లాగా తీర్చిదిద్దే లక్ష్యంతో ప్రభుత్వం యోగాంధ్ర కార్యక్రమాన్ని నిర్వహిస్తోందని, ప్రజలందరూ యోగా సాధనలో భాగస్వాములు కావాలని ఎమ్మెల్యే పిలుపునిచ్చారు.

ఈ కార్యక్రమంలో వైద్య ఆరోగ్య శాఖ అధికారులు, ప్రజాప్రతినిధులు, విద్యార్థులు, యోగా శిక్షకులు, సీనియర్ సిటిజన్లు పాల్గొన్నారు.

Leave a Reply