అందమైన చేతిరాతే.. విజయమంత్రం!

పదో తరగతి విజయానికి బంగారు బాట
గంపలగూడెం జెడ్పీ ఉన్నత పాఠశాలలో కాలిగ్రఫీ శిక్షణ
అక్షరాలను ఆణిముత్యాల్లా తీర్చిదిద్దిన నిపుణులు మారేపోగు రవి

గంపలగూడెం,ఆంధ్రప్రభ: విద్యార్థి ప్రతిభను ప్రతిబింబించేది కేవలం అతని సమాధానాలే కాదు.. వాటిని పొందికగా, స్పష్టంగా వ్యక్తపరిచే చేతిరాత కూడా. ముఖ్యంగా పదో తరగతి పబ్లిక్ పరీక్షల్లో అందమైన చేతిరాత విద్యార్థికి అదనపు బలంగా నిలుస్తుందనే ఉద్దేశంతో గంపలగూడెం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. పాఠశాల ప్రధానోపాధ్యాయులు జి. శ్రీనివాస్ బాబు, ఫిజిక్స్ ఉపాధ్యాయులు సురేష్ బాబు, ఉపాధ్యాయ బృందం ఆధ్వర్యంలో ప్రముఖ కాలిగ్రఫీ, హ్యాండ్‌రైటింగ్ శిక్షణ నిపుణులు మారేపోగు రవి ఆరు రోజులపాటు విద్యార్థులకు ప్రత్యేక శిక్షణ అందించారు.

శిక్షణలో భాగంగా అక్షరాలను గుండ్రంగా, స్పష్టంగా, ఒకే పరిమాణంలో రాయడం, పెన్ను సక్రమంగా పట్టుకోవడం, పదాలు, వాక్యాల మధ్య సరైన ఖాళీ పాటించడం, రాతలో సమతుల్యత, వేగం, పరిశుభ్రత వంటి అంశాలపై ప్రాయోగికంగా అవగాహన కల్పించారు. మొదట సాధారణంగా రాసిన విద్యార్థులు కేవలం ఆరు రోజుల వ్యవధిలోనే తమ చేతిరాతను గణనీయంగా మెరుగుపరుచుకుని అందరినీ ఆకట్టుకోవడం విశేషం.

పదో తరగతి పబ్లిక్ పరీక్షల్లో సమాధాన పత్రాలను మూల్యాంకనం చేసే పరీక్షాధికారులపై స్పష్టమైన చేతిరాత సానుకూల ప్రభావం చూపుతుందని, సమాధానాలు సులభంగా అర్థమయ్యేలా ఉండడం వల్ల విద్యార్థులు తమ ప్రతిభకు తగిన మార్కులు సాధించే అవకాశాలు పెరుగుతాయని నిపుణులు వివరించారు. అందమైన చేతిరాత అనేది కేవలం మార్కులకే పరిమితం కాకుండా, విద్యార్థుల్లో క్రమశిక్షణ, ఏకాగ్రత, సహనం, జ్ఞాపకశక్తి, ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించే ఉత్తమ సాధనమని తెలిపారు.

కాలిగ్రఫీ సాధనతో మెదడు చురుకుగా పనిచేయడంతో పాటు ఆలోచనల్లో స్పష్టత పెరుగుతుందని, నిరంతర అభ్యాసం విద్యార్థుల్లో సృజనాత్మకతను కూడా పెంచుతుందని మారేపోగు రవి పేర్కొన్నారు. రోజూ కొద్ది సమయం కేటాయించి సాధన చేస్తే చేతిరాతలో అద్భుతమైన మార్పు సాధ్యమవుతుందని సూచించారు.

శిక్షణ అనంతరం తమ చేతిరాతలో వచ్చిన మార్పుతో పరీక్షలపై మరింత ఆత్మవిశ్వాసం పెరిగిందని విద్యార్థులు ఆనందం వ్యక్తం చేశారు. గ్రామీణ ప్రాంత ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు ఇలాంటి నైపుణ్యాభివృద్ధి కార్యక్రమాలను అందుబాటులోకి తీసుకురావడం అభినందనీయమని తల్లిదండ్రులు, గ్రామస్తులు కొనియాడారు. విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని వినూత్న కార్యక్రమాన్ని చేపట్టిన ప్రధానోపాధ్యాయులు జి. శ్రీనివాస్ బాబు, ఉపాధ్యాయ బృందం, శిక్షణ నిపుణులు మారేపోగు రవికి వారు కృతజ్ఞతలు తెలిపారు. ఇటువంటి కార్యక్రమాలు ప్రభుత్వ పాఠశాలల్లో విస్తృతంగా అమలు చేస్తే విద్యార్థుల విద్యా ప్రమాణాలు మరింత మెరుగుపడతాయని విద్యావేత్తలు అభిప్రాయపడుతున్నారు.