వాట్సాప్ సందేశంతో పరిష్కారమైన సమస్య
మహాదేవపూర్, ఆంధ్రప్రభ: జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహాదేవపూర్ మండలం కాళేశ్వరం గ్రామంలో గత మూడు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా ఎస్టీ కాలనీలో రహదారిపై వర్షపు నీరు భారీగా నిలిచిపోయింది. దీంతో సమీపంలోని ఇళ్లలోకి నీరు చేరే పరిస్థితి ఏర్పడి కాలనీవాసులు ఆందోళనకు గురయ్యారు. ఈ సమస్యను ఎస్టీ కాలనీకి చెందిన ఓ యువకుడు “కాళేశ్వరం ఇన్ఫర్మేషన్” వాట్సాప్ గ్రూపులో సందేశంగా పోస్టు చేసి, నిల్వ నీటిని తొలగించి ప్రజలను ఇబ్బందుల నుంచి కాపాడాలని విజ్ఞప్తి చేశాడు.
సందేశాన్ని గమనించిన గ్రామ సర్పంచ్ వెన్నెపురెడ్డి మోహన్‌రెడ్డి వెంటనే స్పందించి జేసీబీతో సంఘటనా స్థలానికి చేరుకున్నారు. నిల్వ నీరు బయటకు వెళ్లేలా కాలువలను శుభ్రం చేయించి నీటి ప్రవాహానికి మార్గం కల్పించారు. దీంతో ఇళ్లలోకి నీరు చేరకుండా పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు. సర్పంచ్ తక్షణ స్పందనతో కాలనీవాసులు ఊపిరి పీల్చుకోగా, ప్రజల సమస్యలను వెంటనే పరిష్కరించిన తీరును స్థానికులు అభినందించారు. వర్షాకాలంలో గ్రామ ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అవసరమైన అన్ని చర్యలు కొనసాగిస్తామని సర్పంచ్ తెలిపారు.
