112 ఫిర్యాదులు.. బాధితులకు న్యాయం చేస్తాం: ఎస్పీ విక్రాంత్ పాటిల్

ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికలో వినతుల స్వీకరణ

చట్ట ప్రకారం విచారణ చేసి త్వరితగతిన చర్యలు తీసుకుంటామని హామీ

కర్నూలు, ఆంధ్రప్రభ : ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక ద్వారా స్వీకరించిన ఫిర్యాదులపై త్వరితగతిన స్పందించి, బాధితులకు న్యాయం చేయాలని జిల్లా పోలీసు అధికారులను కర్నూలు జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ ఆదేశించారు.

కర్నూలు కొత్తపేటలోని కర్నూలు టూ టౌన్ పోలీస్ స్టేషన్ పక్కన ఉన్న ఎస్పీ క్యాంపు కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమంలో ఆయన ప్రజల నుంచి వినతులను స్వీకరించారు. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ఫిర్యాదుదారులతో నేరుగా మాట్లాడి వారి సమస్యలను తెలుసుకున్నారు.

ఈ కార్యక్రమంలో మొత్తం 112 ఫిర్యాదులు అందాయి.

ప్రధానంగా నమోదైన ఫిర్యాదులు

పత్తికొండకు చెందిన షేకమ్మ తన కుమారుడు సూర్యనారాయణకు ఉద్యోగం ఇప్పిస్తామని నమ్మబలికి ఇద్దరు మహిళలు రూ.3 లక్షలు తీసుకుని మోసం చేశారని ఫిర్యాదు చేశారు.

కర్నూలు మండలం జి.సింగవరం గ్రామానికి చెందిన వెంకటేశ్వరరెడ్డి, చిట్టెమ్మ, మాజీ సర్పంచ్ నారాయణ, కురవరాజు తదితరులు ఈడిగ నరసింహులు గౌడు గ్రామంలో పలువురి నుంచి లక్షల రూపాయలు అప్పుగా తీసుకుని తిరిగి చెల్లించకుండా మోసానికి పాల్పడుతున్నాడని ఫిర్యాదు చేశారు.

కర్నూలు శ్రీరామనగర్‌కు చెందిన చిన్నపుల్లయ్య, కడపకు చెందిన గంజికుంట సురేఖాదేవి ఒకేషనల్ ఉద్యోగాలు ఇప్పిస్తానని నమ్మించి రూ.6 లక్షలు తీసుకుని మోసం చేసిందని పేర్కొన్నారు.

కల్లూరు మండలం పెద్దకొట్టాల గ్రామానికి చెందిన మహమ్మద్ హుస్సేన్ తాను కమిషన్ ఏజెంట్‌గా సేకరించిన 76 బస్తాల మిరప పంటను గుంటూరుకు చెందిన వ్యక్తికి పంపించినప్పటికీ రూ.7 లక్షలు చెల్లించలేదని, రైతులకు డబ్బులు ఇవ్వడానికి తన రెండు ఎకరాల పొలం కూడా అమ్ముకోవాల్సి వచ్చిందని ఆవేదన వ్యక్తం చేశారు.

పెద్దకడబూరు మండలానికి చెందిన పరమేష్ తనపై తప్పుడు ఆరోపణలు చేస్తూ ఇప్పటికే రూ.2 లక్షలు తీసుకుని, మరో రూ.1 లక్ష ఇవ్వాలని ఒత్తిడి చేస్తున్నారని, ప్రాణభయం ఉందని ఫిర్యాదు చేశారు.

తుగ్గలి మండలం రాంపల్లి గ్రామానికి చెందిన లాలప్ప అధిక వడ్డీ ఆశ చూపించి, రుణాలు ఇప్పిస్తామని నమ్మించి అనంతపురానికి చెందిన ఉపేంద్రతో పాటు మరికొందరు తన నుంచి, తన తరఫున ఇతరుల నుంచి కూడా దశలవారీగా సుమారు రూ.5 కోట్ల వరకు వసూలు చేసి మోసం చేశారని ఆరోపించారు.

కర్నూలు మండలం దిన్నెదేవరపాడు గ్రామానికి చెందిన మద్దిలేటి తన కుమారుడికి రిజిస్ట్రేషన్ కార్యాలయంలో ఉద్యోగం ఇప్పిస్తామని చెప్పి రూ.80 వేల రూపాయలు తీసుకుని మోసం చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని కోరారు.

ఎమ్మిగనూరు మండలం కోటేకల్లు గ్రామానికి చెందిన ఈరన్న, తన ఫ్లాట్ బాండ్ పత్రాలను తీసుకుని వాటి ఆధారంగా రూ.5 లక్షల రుణం తీసుకున్న వ్యక్తి తిరిగి పత్రాలు ఇవ్వడం లేదని ఫిర్యాదు చేశారు.

చట్ట ప్రకారం విచారణ

ఈ సందర్భంగా ఎస్పీ విక్రాంత్ పాటిల్ మాట్లాడుతూ, ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికకు వచ్చిన ప్రతి ఫిర్యాదుపై చట్ట ప్రకారం విచారణ జరిపి బాధితులకు న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. సమస్యల పరిష్కారానికి వేగంగా చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.

కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీ (అడ్మిన్) హుస్సేన్ పీరా, సీఐలు శివశంకర్, రామయ్య నాయుడు, రామాంజులు తదితరులు పాల్గొన్నారు.