దశాబ్దాల సమస్యకు ముగింపు పలికిన ఎంపీ శ్రీకృష్ణదేవరాయలు..!

హర్షం వ్యక్తం చేస్తున్న గ్రామస్తులు…!

ల్నాడు ప్రతినిధి, ఆంధ్రప్రభ : పల్నాడు జిల్లా, అచ్చంపేట మండలం, పెద్దపాలెం ప్రజల దశాబ్దాల సమస్యకు ఒక్క ప్రయత్నంతో నరసరావుపేట పార్లమెంట్ సభ్యులు లావు శ్రీకృష్ణదేవరాయలు ముగింపు పలికారు. గ్రామస్తుల శ్రమ భాగస్వామ్యం తోడై చిరకాలంగా ఉన్న ఈ సమస్యకు చరమగీతం పాడారు. ఇక వివరాల్లోకి వెళితే…అచ్చంపేట మండలం, పెద్దపాలెం గ్రామంలో భారీ వర్షాలు పడి వాగు పొంగిందంటే చాలు…. కొన్ని కాలనీలు జలమయమయ్యేవి. వరద నీరు ఇళ్లల్లోకి చేరి గ్రామస్తులు తీవ్ర ఇబ్బందులు పడేవారు. వరద తగ్గే వరకు రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడేది.

ఆఖరికి ఎవరైనా చనిపోతే, శ్మశాన వాటిక కూడా నీట మునిగి…. అంత్యక్రియలు చేయడానికి స్థలం లేక, రోడ్డు పక్కనే శవాలను దహనం చేయాల్సిన పరిస్థితి వారిది. 2025 నవంబర్ నెలలో చిన్న వంతెన నిర్మించి దానికి పరిష్కారం చూపారు. ఇలాంటి ఎన్నో ఏళ్ల కన్నీటి గాధను, ప్రజల ఇబ్బందులను స్థానిక నాయకులు బాపిరాజు, ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు దృష్టికి తీసుకొచ్చారు. సమస్య విన్న వెంటనే ఎంపీ గ్రామస్థుల కష్టాలను తీర్చడానికి యుద్ధప్రాతిపదికన జేసీబీ (జెసిబి)ని పంపారు. ఎంపీ చొరవకు, బాపిరాజు నాయకత్వానికి పెద్దపాలెం గ్రామస్తుల శ్రమ, భాగస్వామ్యం కూడా తోడైంది. అందరూ ఒక తాటిపైకి వచ్చి, చేతులు కలిపి ఒక్క ప్రయత్నంతో సమస్యను పరిష్కరించుకున్నారు.

దాదాపు 2 కిలోమీటర్ల మేర పూడికతో, పిచ్చిమొక్కలతో నిండిపోయిన వాగును, మురికి కాలువలను జేసీబీతో పూర్తిగా శుభ్రం చేయించారు. అంతేకాదు.. వరద ముప్పు ఉన్న శ్మశాన వాటికను జేసీబీతో చదును చేయించి.. దాదాపు రెండు అడుగుల మేర ఎత్తు పెంచారు. ఫలితంగా ఇప్పుడు ఎటువంటి అడ్డంకులు లేకుండా వాగులు, కాలువలు శుభ్రంగా తయారయ్యాయి. ఇప్పుడు ఎంత వర్షం పడినా ఊరికి ఎలాంటి ముప్పు లేదు. పెదపాలెం గ్రామంలో అభివృద్ధి పనులు ఇంకా కొనసాగుతూ ఉన్నాయి. గ్రామ ప్రజలు, నాయకులు ఎంపీ శ్రీకృష్ణదేవరాయలు తీసుకున్న చర్యను అభినందిస్తూ… ఆయనకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుకున్నారు.