వసతి గృహం నిర్మాణం వేగిరం

మంత్రి నారా లోకేష్ చొరవతో రూ.3.50 కోట్ల సీఎస్‌ఆర్ నిధులు
మంగళగిరి, ఆంధ్రప్రభ: రాష్ట్ర విద్య, ఐటీ శాఖల మంత్రి ప్రాతినిధ్యం వహిస్తున్న మంగళగిరి నియోజకవర్గంలో అభివృద్ధి కార్యక్రమాలు వేగంగా కొనసాగుతున్నాయి. మంత్రి నారా లోకేష్ స్ఫూర్తితో కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ (సీఎస్‌ఆర్) నిధుల కింద తాడేపల్లి మండలం పెనుమాకలో రాడికో ఖైతాన్ లిమిటెడ్ సహకారంతో రూ.3.50 కోట్ల వ్యయంతో ఆధునిక బీసీ బాలుర వసతి గృహం నిర్మాణం శరవేగంగా సాగుతోంది.
మంగళగిరి నియోజకవర్గంలో బీసీ వెల్ఫేర్, సోషల్ వెల్ఫేర్ వసతి గృహాలను మోడల్ హాస్టళ్లుగా తీర్చిదిద్దాలనే లక్ష్యంతో మంత్రి నారా లోకేష్ ప్రత్యేక చొరవ తీసుకున్నారు. అందులో భాగంగానే పెనుమాకలో నిర్మాణంలో ఉన్న ఈ బీసీ బాయ్స్ హాస్టల్ విద్యార్థులకు కార్పొరేట్ స్థాయి సౌకర్యాలు కల్పించేలా రూపుదిద్దుకుంటోంది. ఈ హాస్టల్‌లో ప్రీ మెట్రిక్, పోస్టుమెట్రిక్ విద్యార్థులను దృష్టిలో పెట్టుకుని దాదాపు 150 నుండి 170 మంది విద్యార్థులకు వసతి కల్పించేలా నిర్మాణం చేపట్టారు. ఆధునిక కిచెన్, విశాలమైన డైనింగ్ హాల్, లివింగ్ రూమ్స్, డార్మెటరీలు, స్టడీ హాల్ వంటి సదుపాయాలతో హాస్టల్ నిర్మాణ పనులు జరుగుతున్నాయి. ప్రస్తుతం ఈ పనులు దాదాపు పూర్తి దశకు చేరుకున్నాయి.
విద్యార్థులకు మెరుగైన విద్యా వాతావరణం కల్పించడమే లక్ష్యంగా హాస్టల్‌ను కార్పొరేట్ స్థాయిలో అభివృద్ధి చేయాలని మంత్రి నారా లోకేష్ సంకల్పించారని, అందుకు అనుగుణంగా అన్ని సౌకర్యాలతో ప్రణాళికాబద్ధంగా నిర్మాణం కొనసాగుతోంది.
