Shreyas Iyer | కమ్‌బ్యాక్ అంటే ఇదే..

Shreyas Iyer | కమ్‌బ్యాక్ అంటే ఇదే..

  • టీ20 కెప్టెన్‌గా తిరుగులేని రీఎంట్రీ

భారత క్రికెట్‌లో కమ్‌బ్యాక్ కథలు చాలానే ఉన్నాయి. కానీ శ్రేయస్ అయ్యర్‌ది మాత్రం కాస్త ప్రత్యేకం. ఒకప్పుడు టీ20 జట్టులో కీలక ఆటగాడిగా ఉన్న అతడు.. క్రమశిక్షణా సమస్యల కారణంగా సెలెక్టర్ల దృష్టికి దూరమయ్యాడు. 2023 చివర్లో చివరిసారిగా టీ20 అంతర్జాతీయ మ్యాచ్ ఆడిన అయ్యర్.. దాదాపు రెండేళ్ల పాటు జట్టుకు దూరంగా ఉన్నాడు.

అయితే మైదానంలో తన బ్యాట్‌తో సమాధానం చెప్పడమే శ్రేయస్ ఎంచుకున్న మార్గం. 2024లో కోల్‌కతా నైట్‌రైడర్స్‌కు ఐపీఎల్ టైటిల్ అందించిన అతడు, 2025లో పంజాబ్ కింగ్స్‌ను ప్లేఆఫ్ రేసులో నిలబెట్టాడు. ఈ సీజన్‌లో 604 పరుగులు చేసి తన విలువను మరోసారి నిరూపించాడు. 2026 సీజన్‌లోనూ 498 పరుగులు సాధించి నిలకడైన ప్రదర్శన కనబరిచాడు.

ప్రతి సీజన్‌తో శ్రేయస్ అయ్యర్ కంబ్యాక్ కు సంబంధించిన వాద‌న‌ మరింత బలపడుతూ వచ్చింది. ఒత్తిడిని తట్టుకుని ఆడిన ఇన్నింగ్స్‌లు, కెప్టెన్‌గా చూపించిన చాకచక్యం, జట్టును విజయాల బాట పట్టించిన నాయకత్వం అతడిని మళ్లీ జాతీయ జట్టుకు అనివార్యమైన ఎంపికగా మార్చాయి.

మరోవైపు భారత టీ20 కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ బ్యాటింగ్‌లో ఆశించిన స్థాయిలో రాణించలేకపోయాడు. 2026 ఐపీఎల్‌లో 13 ఇన్నింగ్స్‌ల్లో కేవలం 270 పరుగులు మాత్రమే చేయడంతో అతడి ఫామ్‌పై సందేహాలు వ్యక్తమయ్యాయి. నాయకత్వ పరంగా మంచి మార్కులే వచ్చినప్పటికీ, బ్యాటర్‌గా అతడి ప్రదర్శన సెలెక్టర్లను ఆలోచనలో పడేసింది.

ఈ నేపథ్యంలో భవిష్యత్ టీ20 ప్రణాళికలను దృష్టిలో పెట్టుకున్న సెలక్షన్ కమిటీ కీలక నిర్ణయం తీసుకుంది. గత కొన్నేళ్లుగా నిలకడైన ప్రదర్శనతో పాటు నాయకత్వ లక్షణాలను నిరూపించుకున్న శ్రేయస్ అయ్యర్‌కు టీ20 జట్టు పగ్గాలు అప్పగిస్తూ కొత్త యుగానికి శ్రీకారం చుట్టింది.

సెలక్షన్ కమిటీ ఛైర్మన్ అజిత్ అగార్కర్ మాట్లాడుతూ.. “గత కొన్ని సంవత్సరాల్లో శ్రేయస్ వివిధ ఫ్రాంచైజీలను విజయవంతంగా నడిపించాడు. ఫైనల్ గెలిచాడు. కఠిన పరిస్థితులను ఎదుర్కొన్నాడు. కెప్టెన్‌గా ఉండే ప్రతి అనుభవాన్ని సంపాదించాడు. అతని వ్యక్తిగత ప్రదర్శన కూడా అద్భుతంగా ఉంది” అని ప్రశంసించాడు.

టీ20 ప్రపంచకప్ జట్టులో కూడా శ్రేయస్ ఎంపికకు దగ్గరగా వచ్చాడని అగార్కర్ వెల్లడించాడు. అయితే అప్పట్లో సూర్యకుమార్ యాదవ్ జట్టులో ఉండటంతో అవకాశం దక్కలేదని పేర్కొన్నాడు.

ఇప్పుడు కెప్టెన్‌గా శ్రేయస్ ముందున్న సవాళ్లు కూడా తక్కువ కావు. గౌతమ్ గంభీర్ కోచింగ్‌లో రూపుదిద్దుకుంటున్న కొత్త టీ20 జట్టుకు దీర్ఘకాలిక దిశానిర్దేశం చేయాల్సి ఉంటుంది. లాస్ ఏంజెల్స్ ఒలింపిక్స్, తదుపరి టీ20 ప్రపంచకప్‌ను దృష్టిలో పెట్టుకుని జట్టును నిర్మించాల్సిన బాధ్యత అతడి భుజాలపై పడింది.