Women World Cup | మహిళల వన్డే వరల్డ్‌ కప్‌ షెడ్యూల్ ఇదే…

ముంబై : మహిళల వన్డే వరల్డ్‌కప్‌ 2025 షెడ్యూల్‌ను ఐసీసీ ఇవాళ (జూన్‌ 2) విడుదల చేసింది. ఈ టోర్నీకి సంబంధించిన వేదికలు, తేదీలను ఇవాళ అధికారికంగా ప్రకటించారు.

ఈ ఏడాది సెప్టెంబర్‌ 5-నవంబర్‌ 2 మధ్యలో భారత్‌, శ్రీలంక వేదికగా ఈ మెగా టోర్నీ జరుగనుంది.భారత్‌లోని చిన్నస్వామి స్టేడియం (బెంగళూరు), ఏసీఏ స్టేడియం (గౌహతి), హోల్కర్ స్టేడియం (ఇండోర్), ఏసీఏ-వీడిసీఏ స్టేడియంలో (విశాఖపట్నం) మ్యాచ్‌లు జరుగుతాయి. శ్రీలంకలో ప్రేమదాస స్టేడియంలో (కొలంబో) మ్యాచ్‌లు జరుగుతాయి.

ఈ టోర్నీలో పాకిస్తాన్ ఆడే మ్యాచ్‌లు ప్రేమదాస స్టేడియంలో జరుగనున్నాయి. పురుషుల ఛాంపియన్స్‌ ట్రోఫీ 2025 సమయంలో జరిగిన ఒప్పందం ప్రకారం పాకిస్తాన్‌ భారత్‌లో పర్యటించదు. ఆ టోర్నీ పాకిస్తాన్‌లో జరగాల్సి ఉండగా.. భద్రతా కారణాల రిత్యా టీమిండియా ఆ దేశంలో అడుగుపెట్టలేదు.భారత్‌ ఆడాల్సిన మ్యాచ్‌లు హైబ్రిడ్‌ పద్దతి ప్రకారం దుబాయ్‌లో జరిగాయి.

వరల్డ్‌కప్‌ మ్యాచ్‌ల కోసం పాకిస్తాన్‌ కూడా భారత్‌లో ఆడదని అప్పుడే ఒప్పందం చేసుకున్నారు. భారత్‌, పాక్‌ మధ్య తాజా పరిస్థితుల (ఆపరేషన్‌ సిందూర్‌ తర్వాత) నేపథ్యంలో పాక్‌ జట్టు మన దేశంలో మ్యాచ్‌లు ఆడతామన్న భారత ప్రభుత్వం ఒప్పుకునే పరిస్థితి లేదు.కాగా, ఈ మెగా టోర్నీ ఆరంభ మ్యాచ్‌ సెప్టెంబర్‌ 30న బెంగళూరులో జరుగనుంది. ఈ మ్యాచ్‌లో భారత ప్రత్యర్థి క్వాలిఫయర్‌ పోటీల ద్వారా నిర్ణయించబడుతుంది.

అక్టోబర్‌ 29న తొలి సెమీఫైనల్‌ (గౌహతి లేదా కొలొంబో (పాక్‌ క్వాలిఫై అయితే)), 30న రెండో సెమీఫైనల్‌ (బెంగళూరు) జరుగనున్నాయి. నవంబర్‌ 2న ఫైనల్‌ (బెంగళూరు లేదా కొలొంబో) జరుగుతుంది.

మహిళల వన్డే వరల్డ్‌కప్‌ 12 ఏళ్ల తర్వాత భారత్‌లో జరుగుతుంది.ఈ టోర్నీలో మొత్తం ఎనిమిది జట్లు (భారత్‌, ఆస్ట్రేలియా, ఇంగ్లండ్, దక్షిణాఫ్రికా, న్యూజిలాండ్, శ్రీలంక, బంగ్లాదేశ్, పాకిస్తాన్) పాల్గొంటాయి. ఈ టోర్నీలో ఆస్ట్రేలియా డిఫెండింగ్‌ ఛాంపియన్‌ హోదాలో బరిలోకి దిగుతుంది. 2022లో న్యూజిలాండ్‌లో జరిగిన ప్రపంచ కప్ ఫైనల్లో ఆస్ట్రేలియా ఇంగ్లండ్‌ను ఓడించి ఏడోసారి ఛాంపియన్‌గా అవతరించింది.

Leave a Reply